Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters   

మృత్యుతత్త్వ వివేకము

గాయత్రీ - దీర్ఘాయువును ప్రసాదించును.

మృత్యువు అనునది శరీరమునకా? లేక జీవునకా? మృత్యువు అనునది కలదా? లేదా? మృత్యువు కాదు అది శరీరము యొక్క మార్పు మాత్రమే అని గ్రహింప తగియున్నది.

1. ''అసతోమా సద్గమయ'' అక్ష్యుపనిషత్‌ నందు తెలుబడినది. అసత్పదార్ధమగు అనాత్మ నుండి సత్పదార్ధమగు ఆత్మను పొందించుమా! అని మొదటి ప్రార్ధనము.

అనగా దేహమే ఆత్మ అనుకొనెడి బుద్ధి అసత్పదార్థము.

అనగాజగత్తునిత్మము, సత్యము, అని భావించు తలంపు,

__________________________________________________________________________________________________________________________________________________________________హక్కులు మాని: ప్రథమ ముద్రణము- 1979 ప్రతులు 500

ప్రొగ్రెసిస్‌ ప్రింటర్స్‌. విజయవాడ2. వెల రూ. 3-00

ఆతలంపు నుంచి త్రికాల బాధ్యమగు సత్‌ అగు ఆత్మను చేర్చుమా! యని భావము. ఇందు మూలమున ఆత్మ సద్రూపమని తెలియబడు చున్నది.

2. ''తమ సోమా జ్యోతీర్గమయ'' చీకటి నుంచి వెలుగు (లోనికి) నకు చేర్చుమా! యని రెండవ ప్రార్థనము. అనగా అజ్ఞాన (అవిద్య యనెడి అంధకారము) మనెడి అంధకారము నుంచి జ్ఞానమనెడి వెలుగును పొందించుమా! అని భావము. అవిద్య నుండి విద్యను పొందించుమని తాత్పర్యము. చిద్రూపమగు (జ్యోతిః=ప్రకాశము) వెలుగు=ఆత్మను పొందించమని పిండితార్థము.

3. ''మృత్యోర్మా అమృతంగమయ'' మరణ ధర్మము గల శరీరము నుంచి అమృతత్వమును (మృత్యువు లేని స్థితిని) చైతన్యమును పొందించుమా! అని మూడవ ప్రార్థనము. అమృతత్త్వము=మరణ ధర్మము లేకుండట=నందము= అది అనంతము. అనగా ఆ సంతోషము అంతము లేనిది. కాన అనంతమనబడినది. అదియే ఆనందము. ఆనందరూప మనిభావము. కాన సచ్చిదానంద మయమగు నాత్మను చేర్చుమని మూడు ప్రార్థనా వాక్యముల సారాంశము తెలుపును. సత్యము-జ్ఞానము- అనంతము- ఆనందము బ్రహ్మ అను లక్షణములతో నొప్పు చున్నది పరమాత్మ=పరబ్రహ్మవస్తునని బోధపడుచున్నది. ''సత్యం జానమనంతంబ్రహ్మ'' అనియును, ''ఆనందో బ్రహ్మేతివ్వజానాత్‌'' అనియును, శ్రుతి ప్రమాణములు తెలుపుచున్నవి. నిత్య సుఖమగు ఆనందము బ్రహ్మయని తెలియుచున్నది.

''మృత్యువు లేని జీవనములో కాధీశ ఇప్పించవే'' అని బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరము (ఆయుతవర్గము)లు ఘోర తపంబొనర్చి, వాని అనుగ్రహమును వడసి హరణ్యకశివుడను దనుజేంద్రుడు వరమును గోరుటలోని గొప్ప తన వేమనగా- ''జాతస్యహి ధృవో మృత్యుఃధృవం జన్మమృత స్యచ'' అని గీతామాతా పలుకుచున్నది మఱియు, ''అనిత్యాని వశరీరాణివిభవో నైన శాశ్వతః అని నీతియు తెలుపుచున్నది. పుట్టినవాడు చచ్చుట (ఇది యొక దేహము యొక్క విడచుట యనెడి మార్పు) చచ్చినవాడు మరల పుట్టుట (ఇది వేరొక శరీరమును పొందుట=ధరించుట=తాల్చుట)యు ఇట్లు బండి చక్రమువలె పరిభ్రమించు (తిరుగు) చుండును. అనగా బండి చక్రమునకుగల ఆకులు అడుగుననున్నవి పైకిని, పైనయున్నవి అడుగునకును తిరుగుచుండును. నూతి వద్ద యాతిము (ఘటీ యంత్రము) గూడ అడుగునుంచి పైకిని, పైనుండి అడుగునకు తిరుగుచు నీరుతోడును గదా! అట్లే జనన మరణరూప సంసార చక్రమున జనన మరణములు గూడ జరుగుచుండును కాన మృత్యువు లేని జీవనము (మృత్యువు కలుగగనే మరల జననము కలుగును. జననము కలుగగనే కొంత కాలమునకు తిరిగి మరల మృత్యువు చేరి కబళించును. అట్లు జరుగని విధము అని భావము) అనగా మృత్యువు కలిగిన కొంతకాలమునకు తిరిగి మరల పుట్టుకయులేని జీవనము (బ్రతుకు)ను అని ఉప లక్షణములుగా గ్రహింపవలయును. అనగా జననమరణములు లేని (కలుగని) అనగా ఏ విధుములగు మార్పులు లేని, చిన్మయ శాశ్వత స్థితిని అనగా అమృతత్త్వమును అనుగ్రహింపుమని వరము యొక్క ముఖ్య భావార్థము.

2. కోసల దేశప్రభువగు దశరధ మహారాజు సేద్య గాండ్ర పైరు పచ్చలను చెడగొట్టుచుండు వనవరాహములను, లేళ్ళను, దుప్పులను, వేటాడి కర్షకుల బాధను నివారించుటకై మృగయా విహారమునకు బోయి తాను నేర్చిన శబ్దభేదివిద్య ననుసరించి బాణ ప్రయోగమునుచేయ, నా శిలీముఖము ఒక ముని బాలుని హృదయమున తీవ్రముగా నాటెను. ఆముని పుత్రుడు తన తల్లి తండ్రులు, అంధులును, దాహపీడితు,లగుటచే వారి కొరకు నీటిని గొనితేర సొరబుఱ్ఱను ముంచు చుండ జలమున బుడబుడ ధ్వని కలుగుటచే, వనగజమని భ్రాంతి చెంది రాజు బాణ ప్రయోగ మొనరించెను. ఆముని కుమారుడు తన వక్షమున నాటిన శరబాధకు తాళజాలక, హాహాకారములు చేయసాగెను. అదివిని రాజు అయ్యో నాచేతి బాణము మానవునకు గ్రుచ్చుకొనెను కాబోలును. నేను వన్యగజము నీరు త్రాగుచున్నదని తలంచితిని. అని విచారించుచు వానిని వెదుకపోయెను. వేటగాని చే విడువబడిన బాణవేగము ఉపసంహరింప నేరికిని వలనుపడదు. కులాలుని చేతిలో దండముతో త్రిప్పినక్కుల చక్రము దండమును వదలినను చక్రమును తిరుగుచునే యుండును. దాని వేగము కొంత కాలము వరకు అట్లే తిరుగుచుండును. అట్లే మానవుని జన్మాంతర పుణ్య-పాప-సంచితకర్మ (ప్రారబ్ధ) ప్రవాహ వేగము గూడ కర్మానుభవము పూర్తి యగువరకు ఎంతటి జ్ఞానికైనను నివారింప వలనుపడదుగదా! అట్లే ఆ రాజు పశ్చాత్తాపమును పొందినను బాణవేగము నుపసంహరింపలేకపోయెనని తలపనగును.

ద్వాదశీ వ్రత నిష్ఠాగిరష్ఠుడగు నంబరీష చక్రవర్తి, ద్వాదశీ ఘటికలు దాటిపోవుచున్న వనియు, అతిథిగా వచ్చిన దుర్వాస మునివరేణ్యుడు స్నానార్థమై నదికిపోయి ఇంకను రాకయుండెనని తలంచి, అటగల పండిత ప్రకాండుల నానతింబడసి శుద్ధజల పారణంబు చేసినంతలో నా దుర్వాస మహర్షి అటకరుదెంచి, అతిథిని వదలి జలపారణంబు చేతువాయని ఆగ్రహ పూతుండై అమ్మహర్షి యంబరీషునిపై అగ్ని పరీక్షవలె తన జటం బెఱికి నేలనుగొట్టి యొక శక్తి నుద్భవింపజేసి రాజచంద్రునిపై ప్రయోగించెను ఆ శక్తి ఘోరమగు మహాగ్ని జ్వాలలతో రాజుపైబడ, భక్త రక్షణార్ధమై శ్రీ మహావిష్ణువు తన్నివారణమునకై తన సుదర్శన చక్రంను ప్రయోగ రూపమున బంపెను. ఆ చక్రరాజము దుర్వాస మహర్షి ప్రయోగించిన మహాశక్తిని, దానిని ప్రయోగించిన ఋషి పుంగవుని పైబడి వెంటాడి ముల్లోకంబుల ద్రిప్పి రక్షకులును గానక, చక్ర ప్రయోగ మొనర్చిన విష్ణుని శరణుజొచ్చెను. అతడు నా అధీనమేమియును లేదు. భక్త రక్షణకై చక్రము వెళ్ళెను. భక్తుడగు నంబరీషుని పాదముల నంటి మ్రొక్కిన దాని నుండి రక్షణమగునని యుపాయమును తెలిపెను. వాని నానతిని అంబరీషుని శరణుజొచ్చెను. అభయమును గోరెను. అంత చక్రవర్తి చక్రరాజసుత్తి నొనర్చి బుషిని గావుమని ప్రార్ధి పశక్తిని సంహరించి సుదర్శన చక్రము ఋషిని వదలి విష్ణువు చేరెను. ఇట్లు ఋషి ప్రయోగించిన శక్తిని, విష్ణువు ప్రయోగించిన చక్రరాజము దానిని సంహరించి, (అంబరీష కృత చక్రస్తుతి ఉపసంహరింప చేసి ఋషిని రక్షించి) అంబరీష చక్రవర్తి ఖ్యాతి గడించెను. కాన దీని వలన మనకేమి తెలియుచున్నది? అనగా విష్ణువు ప్రయోగించిన చక్రమును విష్ణువే ఉపసంహరింపక పోయెను. భక్తసుత్తి వలన దానికదియే ఉపసంహారమును పొందెను. అని తెలియుచున్నది.

ఎంత పొరపడితిని పశ్చాత్తపుడై మునికుమారుడు నేల పడివున్న తావుకేగి వాని వృతాంతమంతయును, వినివాని యానతిని గొని, నీటితోనిండిన సొరకాయ ఋఱ్ఱను, ముని బాలుని తల్లితండ్రుల కొసంగుటకు బోయెను. ఆ వృద్ధాంధ మునిదంపతులు రాజు కాలిసవ్వడి నాలించి ''నాయనా నీరు తెచ్చుటకింత యాలసించితివేల?'' యని యడుగగ, రాజు, ''నేనీ దేశమునేలు ప్రభువును. నీతుసుడను గాను. వనజగజమను భ్రమతో నొక బాణమును విడువ నా శరము నీపుత్రుని వక్షమున నాటెను. యీ మంచినీరు మా తల్లితండ్రులకు అందించుము. వారుదాహ పీడితులై యుండిరి. నేను బాధ భరింపజాలను. ముందు శరమును లాగివేయమని పలికెను. బాణమును దేహమునుంచి లాగివేయగనే, అతడు ప్రాణములను వదిలెను'' అని ''యీ నీటిని గ్రోలి దాహబాధ తీర్చుకొను''డని రాజు పలికెను. కుమారుడు మృతుడయ్యెనను శోకతప్తుల మగు మాకేల దాహశాంతి కలగును? కన్నులు లేని వార్థక్యమున నున్న మాకు దిక్కేది? అని విలపించుచు, ''ఓ రాజ! నీవును మాపలెనే పుత్రశోకముతో మరణింతువు గాక'' అని శపించి వారు అసువులను విడనాడిరి. ఈ శాపమున ఒక అనుగ్రహవరము ఇమిడి యున్నది. అది ఏదియన, దశరధున కప్పటికి 60 వేల సంవత్సరములు వయస్సు, గలిగియు, సంతతి లేని కారణమున, ఈ శాపముచే పుత్రులు కలుగునట్లు అనుగ్రహరమును, ఆ ఫత్రు వినియోగదుఃఖ భావమున మరణము కలుగునట్లు శపించుటయు అను రెండు రకములు కలవు కాన ''టుబర్‌ డ్‌స్‌ ఇన్‌ వన్‌షాట్‌''అనునట్లు ఒకే బాణఘాతముచే రెండు పక్షులోకేతూరి లభించునట్లు ఒక శాపమునందు రెండు వరములు ఇమిడియున్నవి అపుత్ర కుడగు నాకు పుత్రపాప్తియనువరము, ఆపుత్ర వినియోగసంజనితదుఃఖమున మరణ ప్రాప్తియను వరమును, అను రెండు ఫలములు గల శాపము గలిగెను దశరధ మహారాజు పుత్ర ప్రాప్తి కలుగునని మిగుల సంతపించెను కాని పుత్ర వియోగమున మరణము కలుగునని ఏ మాత్రము చింతింపలేదు.

5. ఇట్లే ఒక వృద్ధాంగన అవివాహితనుండి భగవంతునిగూర్చి ఘోరతపంబొనర్చెను. భగతావ్సక్షాత్కారము గలిగి దైవము వరమును కోరుకొమ్మనియెను. అవి వాహితయగు నావృద్ధకుమారి ''నాకు ఇరువది వర్షముల ప్రాయం గల, బలమును అందమును, సద్గుణములును గల దీర్ఘాయుష్మం తుడగు భర్తనను గ్రహింపుమని వరమును గోరెను. భగవాను డట్లేయగుగాక యని వరమును నొసంగి అంతర్హితుడయ్యెను. ఈ లోకమున వృద్దాంగనను వివాహమాడు వారెవరుందురు? ఎవరును ఆ వృద్ధ కుమారికి వార్థక్యముపోయి ¸°వనము సంప్రాప్తించుట వరములోని యొక ముఖ్యఫలము. పిమ్మట ¸°వన వంతుడును, ఆయుష్మంతుడునుఅగు భర్త లభించుట వరములోని రెండవ ఫలము. కనుక ఒక వరములో రెండు వరములు ఇమిడియున్నవి అట్టియు క్తిగల వరమును గోరివృద్ధస్త్రీసఫల మనోరధమయ్యెను. అనియొక ఇతిహాసము కలదు. ఇదియే ''వృద్థకుమారీవర న్యాయ''మనుపేగున నొకన్యాయము నేటికిని లోకమున వ్యవహరింపబడు చున్నది. అట్లే దశరధ మహారాజు నకుగలిగిన ముని శాపమునందును, హిరణ్యకశిపునకు బ్రహ్మయొసంగిన వరమునందును, రెండు ఫలములు కలిగియుండుటచే నచట వృద్ధకుమారీవర న్యాయము స్ఫురించు చున్నందున దానినిటు ప్రస్తావింపవలసివచ్చినది. దానినిట పొందు పఱచితిని.

6. ఒక జ్యోతిష్యము నెరింగిన విప్పుడురాగా ఒక జాతకమును చెప్పి చక్రమును చేతికందించి ఫలములు చెప్పమని కోరెను. ఆ పండితుడు జాతకచక్రమండలిని చూడగనే ''యీ జాతకమునకు ద్వికళ త్రయోగము కలదని'' ముందుగా తెలిపెను. అంతనాయజమాని మీరెట్లు చెప్పగలిగిరని ప్రశ్నింప, ఈ జాతకము కన్యాలగ్నము సప్తమమున శనియున్నందున కన్యాలగ్న జాతకులకు సప్తమమున శనియున్నచో, 100కి 90 మందికి ద్వికళత్రయోగము గలుగునని తెలిపెను అంతనా యజమాని ఆర్యా; ఇక మీరు చెప్పిన జాతకఫలములు చాలును. సంతృపి కలిగెను. కారణమేమన ఈ బాలునికని, తల్లి మూడవదినమునందే దివికేగినది. నాకు భార్యా చెల్లిలికుమారుడు. నాకు ఒక ఆడపిల్ల కలదు. పురుష సంతతిలేదు. తల్లిలేనిఈ బాలునకు మూడవ మాసము. మా దంపతులమే వీనిని పెంచుచుంటిమి. వీనికి ద్వికళత్రయోగమని తెలిపినారు. ఈ బాలుడు పెరిగి పెద్దవాడై వివాహితుడైన కొంత కాలమునకు గదా వీనికి భార్యా వినియోగము జరిగెడివయస్సు. అంతవరకు బాలుడు సుఖముగా జీవించును. అతని కళత్ర భంగమును మేము చూడముగదా! మేము పెంచి పెద్ద వానిని చేసినందులకు అంతవరకూ జీవించునుగదా యని మా ఆశయం. కాన వీని జీవితమును, ఆయువును మాకు కావలసిన విషయమును తెలిపినారు. నాకు సంతోషము జనించినది. కాన ఇక ఫలములను చెప్పనక్కరలేదు. చాలునంటిని. మీరన్యధా తలచకుడని మా ప్రార్ధనము. కాన ఒక ఫలమును చెప్పుటలో రెండు ఫలములు ఇమిడియున్న వనియు, ఇదియునట్టి న్యాయమేయని యనియు, నా ఆశయము. అని పలికెను. గుడివాడ తాలూకా బేతవోలు గ్రామ నివాసులు, శ్రీ శిష్‌ట్లా%్‌ట్లా వెంకటశాస్త్రిగారి శిష్యులు ప్రశ్నించిరి. దారకాచార్యులు చెప్పిరి.

''పుట్టని, చావని త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి''యని ప్రహ్లాద వచనము ఆంధ్రభాగవతి గ్రంధమున గాంచనగును. జనన మరణములు లేని త్రోవ వెదకికొనుట, యనగా అమృతత్త్వ ప్రాప్తికై ఎదురుచూచు (కాంక్షించు) వాని బుద్ధియే గొప్ప బుద్ధిలక్షణమని యసురబాలురతో ప్రహ్లాదుడు పలికిన వాక్కుల భావమును మనోజ్ఞము గదా! ఉదయము=పుట్టుట, అస్తమయము=చచ్చుట, అని ఉదయాస్తమయ శబ్దముల కర్ధమిలు గోచరించును. సూర్యుడు ఉదయించెను. అనగా సూర్యడు మనకంటికి గోచరించుటయే ఉదయించుట. సూర్యడు అస్తమించెను. సూర్యుడు మనకంటికి కానరాకుండుటయే అనగా మేఘములచాటున కేగుటయేగాక, భూమి చాటునకేగి సముద్రమున మునింగినట్లు అగపడుటయే అస్తమయము. అంతమాత్రమే దాని అర్ధము కాని సూర్యుడు జనించెను. మృతినొందెను అను భావమును గాని, అర్ధమును గాని మనము పరిగ్రహింపగూడదు. మృతినొందిన ఎడల మఱల సూర్యుడు మరుసటి దినమున ఎట్లు ఉదయింపగలడు? ఉదయింపజాలడు గదా! కాన సూర్యుడు మృతినొందలేదు. కనుకనే మరల మరునాడు మన కంటికి కగపడునట్లు రాగలిగెను. భూమిచాటుననున్న సూర్యడు భూమి అడ్డు తొలగి మనకనులకు కనుపించుటయే సూర్యుడు ఉదయించుటయని యందురు. ఇది ప్రాతః కాల సమయమున జరుగును. భూమి చాటుననుండుట చేతనే సూర్యుడు మన కనులకు కానరాక యుండెను ఇది సాయంకాల సమయమున జరుగుచుండును. కాన మఱునాడు ఉదయము వేళయ దు భూమియొక్క చాటు భాగము నుండి మన నేత్రముల కగపడు చుండెను. అతడసలే లేకపోయిన ఎడల మరునాడు మనకెట్లు కానవచ్చును? ఉన్నవాడే కానవచ్చును, ఉన్నవాడే భూమిచాటునకేగినపుడు, అనగా మనకంటికిని సూర్యునకును, భూమి అడ్డువచ్చినపుడు మాత్రమే సూర్యడస్తమించెనని అనుచున్నారము. లేనివాడు రాడు. ఉన్నవాడుపోడు. ''యదభావి నతద్భావి- భావిచేన్నతదన్యధా" అను సూక్తి మూలమున, కాని పని ఎంతప్రయత్నించినను కానేకాదు. కానున్నది (జరుగనున్నది) ఎవరెంత నిరోధించినను కాక (జరుగక) మానదు' గదా! అని తెలియును. ''నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః'' లేని వస్తువునకు ఉనికియే లేదు. ఉన్న వస్తువునకు లేమి (అభావము) ఉండదు అనీ గీతాచార్యులు పలికిన శ్లోక తాత్పర్యం. కాన ఉన్న సూర్యుడేకంటికి కానరాకుండుటయు కంటికి కాన రాని అనగా భూగోళముచే నడ్డగింపబడియున్న సూర్యుడే మరుసటిదిన ప్రాతః కాలమున మరల కంటికి గోచరించుటయు జరుగుచున్నది. కాని నిజమును విచారింపగా సూర్యునకు ఉదయాస్తమయములు అనగా జననమరణ ధర్మములు లేవు అని బోధపడుచున్నది.

శ్లో. చక్షుద్దృష్టినిరోధే7 బ్రై సూర్యోవాస్తీతిమన్యతే|

తధా7జ్ఞానాకృతోదేహి బ్రహ్మనాస్తీతి నదే||

ఇత్యాత్మ బోధోపనిషది ప్రోక్తం.

మేఘములచే నావరింపబడిన సూర్యుడు మన కనులకు గోచరింపడు. అంత మాత్రముచే సూర్యుడు లేడని చెప్పతగునా? లేడని వచింపగూడదు గదా! వాయు ప్రసారముచే మేఘముల అడ్డుతొలగిపోయిన వెంటనే సూర్యుడు మన దృష్టికి కానవచ్చును. అట్లే మాయ=అవిద్య=అజ్ఞానము=అనాత్మచే ఆవరింపబడిన అనగా యోగమాయా సమావృతుడగు ఆత్మ మాయ=అవిద్య=అజ్ఞానము=అనాత్మయనెడి ఆవరణము తొలగగనే, విక్షేపము గూడ తొలగి సత్యము బుద్ధికి గోచరించును. ఆత్మసాక్షాత్కారమనినను అదియే. కాన గురుభోద చేతను, వేదాంత మహావాక్య విచారణ చేతను అవిద్యాబంధ విముక్తి గలిగి నిత్య సత్య శుద్దబుద్దముక్త ప్రకాశమాన మగు నాత్మ, సాక్షాత్కారముగ ప్రకాశించి స్వానుభవమునకు వచ్చును. కంటికి శుక్లములు (కాంట్రాక్టు) వచ్చినంతమాత్రమున సూర్యుడా నేత్రరోగికి కానరాడు. అందుచే సూర్యుడు లేడు అన చెల్లునా? సూర్యుడు లేడనగూడదుగదా? శుక్లములు నేత్రవైద్యుని యొక్క చికిత్సచే తొలగింపబడిన వెంటనే సూర్యబింబము కాననగును. అట్లే సద్గురుని బోధామృతమహాత్మ్యముచే, అవిద్యావినిర్ముక్తి కలుగగనే, ఆత్మ, ఆత్మకు=తనకు తాను తద గోచరించునని భావము. ఇట్లాత్మ బోధోపనిషత్తునందు తెలుపబడెను.

''అసావాడిత్యో బ్రహ్మా" ఈ ప్రత్యక్షముగ కానవచ్చు నాదిత్యమండలాంతర్వర్తియగు దివ్య తేజమే బ్రహ్మయని సూర్యోపనిషత్తునందును, మహావాక్యోపనిషత్తునందును తెలుపబడెను.

''ఓమిత్యేకాక్షరం బ్రహ్మ''ఓమ్మను నేకాక్షర నాదము బ్రహ్మమని సూర్యోపషనిత్తు నందును చెప్పబడినది. కాన అవిద్య=బ్రహ్మ=ఓంకారనాగము బ్రహ్మకు పర్యాయపదములని గ్రహించవలెను.

''నోదేతి నా స్తమేత్యే సంవిదేషా స్వయం ప్రభా'' అనియూ కలదు. స్వయంప్రకాశమానమగు దివ్య తేజముఅగు జ్ఞానము ఉదయించునదియు, అస్తమించునదియు కాదు.

''హృద్యాకాశేచిదాదిత్య స్సదాభాసతి భాసతే నాస్త మేతినచోదేతి|| ఇతిమైత్రేయోపనిషత్తు పలుకుచున్నది.

హృదయా (దహరా) కాశమున చిత్‌ రూపుడగు నాదిత్యుడు ఎల్ల వేళలందును ప్రకాశించుచునే యుండును. అతడు అస్తమింపడు. మరియు నుదయింపడు అని మైత్రే యోపనిషత్తు తెలుపుచున్నది.

కావున సూర్యునకు ఉదయా స్తమయములు లేవని రూఢిగ తెలుపుచున్నది. మన నేత్రదృష్టికి మాత్రమే సూర్యనకు ఉదయా స్తమయములున్నట్లు గోచరించు (పొడగట్టు) చుండును. ఇది వ్యావహారిక సత్యమై కానుపించినను. పార మార్థిక సత్యము మాత్రము కానేరదు. కాన మనము చూచి నది అసత్యమనియు, మనకు కానుపించనిది మాత్రమే సత్యమనియు, తెలియుచున్నది. అనగా పరమార్థము, మన ఇంద్రియములకు కానవచ్చినది అసత్యము=మిధ్య=దబ్బర=అనృతము=వట్టిది=హుళక్కి. మనకు కానరానిది సత్యమని గ్రహింపవలయును ఆత్మయే మనకు కానరాక అంతటను, సర్వత్ర ప్రపంచమున, బాహ్యాభ్యంతరములందు వ్యాపించి యుండి సర్వమును ఆత్మ తెలిసికొనుచున్నది. మనలో ఆత్మయుండియు మన కేరికిని తెలియబడుట లేదు. మనము చేయు పనులన్నిటిని ప్రకట, రహస్య కృత్యములను కనురెప్పవాల్పక చూచుచుండెనని గ్రహించవలయును. నిరంతరాత్మాన్వేషణము చేత మాత్రమే ఆత్మ తెలియబడును.

అట్లే జీవునకు (దేహికి) జననమునకు పూర్వము గర్భస్థుడైయుండి, కంటికి కనుపించుటచే, ఆమె కుమారుని కనెను (చూచెను) అని యందుము. కనుట= చూచుట దీనినే ప్రసవించుట అని అర్థమును చెప్పుకొనుచుంటిమి. ఉన్న జీవుడు శరీరమున వదిలిపోవుటను మరణమని మనుకొనుచుంటిమి. కాని అది జీవుని ధర్మము కాదు. అనగా జీవునకు (దేహికి) మరణ ధర్మము గాని, జనన ధర్మముగాని, లేవు. ఇక ఆ ధర్మములు రెండును శరీరమునకు కలుగుచుండును. ఇక శరీరము ఎవరిది? ఇది ప్రకృతికి సంబంధించినది.

ప్రకృతికి మాత్రము జననమరణ ధర్మములుండునా? నిజమును విచారించినచో, ప్రకృతికి జననమరణ ధర్మములు లేవు ప్ర= ప్రకర్షగా, కృ= (కఞ్‌కరణ అను ధాతువు) చేయుటచే, తి= తిష్టతి= ఉండును. పూర్తిగా ప్రకృతికి నాశము లేదు. కాని మార్పుగలుగుచుండును.

ప్ర= సత్త్వము కృ= రజస్సు, తి= తమస్సు, వీని యొక్క సామావస్థయే ప్రకృతి నాబడుచుండును. ప్రకృతి పరిణామమును పొందుట వ్యావహారిక సత్యము. కాని పారమార్థిక సత్యము మాత్రము కాదు.

జీవుడు శరీరము వదిలిన పిమ్మట ఏమి జరుగును? అను విషయమును గూర్చి నా రచనయగు సంధ్యాప్రభోధము, ద్వితీయ భాగమునందు, మానవత్వము, అను గ్రంధమున 20, 21, 22, 23, శీర్షికలందు, 81 పుటనుంచి, 96వ పుట వరకు, చదవినచో విపులముగా బోధపడును. అది ''జన్మతత్త్వవివేకమును'' మన కెఱుకపఱచును. ఇట గ్రంధ విస్తర భీతిచే విరమించితిని. జీవుడు శరీరమును వదలిన పిమ్మట జలమునందు విడిచి జలచర భక్షణయోగ్యముగనో, భూమియందు ఖవనమొనర్చుటయో, అగ్నియందు దగ్ధమొనర్చుటయో చేయబడి, శరీరము బూదియై వర్షజల ప్రవాహ వేగమున కొట్టుకొనిపోయి నదులలో కలిసి, ఆ నదీ జలములను, కాలువలమూలుమున, భూములయందు ప్రవహింప చేయుటచే, ఆ దేహ సంబంధమగు భస్మము (బూడిద) మాగాణి (పల్లపు= వరిపొలము) భూములందు వండ్రుగా పేరుకొని, భూమియందు పడిన విత్తనముల మూలమున మొలకలెత్తి, పెఱిగి, పండి, వరి, జొన్న, చెఱకు, అరటి, మంచి గుమ్మడి, పుచ్చకాయ, సొరకాయ, కుష్మాండము=బూడిద గుమ్మడి, దోస, బెండ, కాకర, బీర, వంగ, చేమ, పెండలము, చిలకడము= మోహనము, మున్నగు కాయధాన్యములుగను, కూరగాయలుగను, దుంపలుగను, కంది, పెసర, మినుము, అనుము, మున్నగు పప్పుధాన్యములుగను, మామిడి, నిమ్మ, దుబ్బ, నారింజ, బత్తాయి, సపోటా, కమలా, ద్రాక్ష, ఖర్జూరము, మున్నగు ఫలములుగను, ఉద్భవించి, ఆహారముగ పచనమై, మనుష్యుని ముఖాగ్నియందు బడి, దంతములచే సమలబడి, లాలాజలముచే పలుచనై, పైత్యరస, జఠర రస, మధుర రస, సహాయమున జీర్ణించి, రక్తముగను, వీర్యము గను, బీజముగను, తేజముగను, మార్పు చెందును. ఆహార సంజనిత వీర్యము కామదేవ కృపవలన గలిగిన ¸°వనదశ యందు పురుషునిచే (మాతృ) స్త్రీ గర్భమున ఆదానము చేయబడి, ప్రవేశించి, నవమాసపరిమిత కాలమటనుండి, దశమ మాసమునిండి, స్త్రీ, పు, నర, జంతు, మృగ, సరీసృప; కీటక, పక్షి రూపము నొంది, ప్రసవమై (జనించి) బిడ్డయై, శరీరమును దాల్చి జన్మించి క్రమాభివృద్ధి నొందుచుండును. కాన శరీరము గూడ ప్రకృతి వైచిత్య్రముచే మార్పు చెందును కాని నశింపనేరదని తెలియుచున్నది.

''మమ మాయా దురత్యయా'' నా మాయశక్తి దాట వీలు కానిది. అనగా నతిక్రమింపవలనుపడదు. ''ప్రకృతింస్వామధిష్ఠాయసంభవామాత్మ్య మాయయా'' స్వకీయమగు ప్రకృతి నాధారముగ చేసుకొని నా మాయాశక్తిచే అధిష్ఠాన చైతన్యమగు నేను సంభవించుచున్నాడను. (అనగాఅవతరించుచున్నానని భావము.) అనియు భగవద్గీత బోధించుచున్నది.

ఇక తాంతత్రయోపదేశక్రమమును శ్రద్ధయైగమ నించుదురు గాక.

1 ఉత్తిష్టత 2 జాగృత 3 ప్రాప్యవరాన్‌నిబోధత. ఇది కఠోపనిషత్ప్రోక్తం. నితాంతము తాఁత త్రయమును కఠ వల్లి బోధి చుచు. హెచ్చరి చుచున్నది. ఏమిని, నితాంతం= ఎల్లప్పుడు తాంతత్రయము. ''త'' యను వర్ణము తుది యందుగల పదత్రయమును కఠవల్లి నిధించుచున్నది. ఏమగా,

1. ఉత్తిష్ఠత= అజ్ఞానమనెడి నిద్దురనుండి లెండు. అల సత్యమును = మాంద్యము = బద్ధకమునుండి లెండు అని మొదటి హెచ్చరిక.

2. జాగ్రత్త=మేలుకొనుడు. నిద్రమత్తునుంచి జాగ్రత్త (జాగరూకత) వహించుము. 1 జన్మము 2 జరా ఈ రెండును దేహమునకు సంబంధించినవి 3 దేహము నాశ్రయించి మూడవది యగు జాయ స్వార్థ పర్వతముచే ప్రాప్తించినది. 1 జన్మము=పుట్టుట 2. జాయ, పుట్టి పెరిగిన పిమ్మట దేహమునకు ¸°వన దశ ప్రాప్తించగనే భార్యా గ్రహణము గలిగెను. ఈ భార్యా పరి(ణయము). గ్రహణము భర్త తమ సుఖమునకు జాయను పరిగ్రహించెనని తలంచును. కాని భార్యయే తన సుఖభోగ భాగ్యాదుల ననుభవించుటకు స్వార్థపరురాలై తాను భర్తను చేరుచున్నదని శ్రుతిశీర్షముల వలన తెలియుచున్నది.

''నవాఅరే పత్యుః కామాయ. ఆత్మవస్తు కామాయ'' అని శ్రుతి తెలుపును బార్యాభర్తలిరువురును స్వార్థపరులే కాని, నిస్వార్థపరులు మాత్రము కారని తెలియును.

''దర్మ ప్రజా సంపత్యర్థం స్త్రీయ ముర్వుహే'' ధర్మమును, సత్సంతానమును అతిథి యభ్యాగతుల యొక్కయు దేవతా పూజల నిమిత్తము, పితృదేవతారాధనముల కొరకును స్త్రీని పరిణయమొనర్చుచుంటినని ధర్మ శాస్త్రములును, ధర్మ సూత్రములు, గృహ్య సూత్రములును తెలుపుచున్నవి. కాని ఇది వ్యావహారికము. పరమార్థమును ఆలోచించినచో, భార్యవలన ముక్తి సాధింపబడదనియు,

''ఉద్థరేణాత్మ నాత్మనం నాత్మాన మవసానయేత్‌'' అనిగీతామాత పరమార్థతత్త్వమునపదేశించుటచే , భార్యను, సంసారమును వదలి సన్యసించి, మహావాక్య శ్రవణమననముల నొనరించి, ప్రస్థానత్రయమును శ్రవణముచేసి, బయటపడుచున్నాడు. ఇది పరమార్థసత్యము. 3 జరా= భార్యా సంతతుల పోషణముచే, తనువు అలసి ముసలి తనము ప్రాప్తించును. ఇది జకారత్రయమును సూచించును.

శ్లో|| జన్మ దుఃఖం జరాదుఃఖం జాయదుఃఖం పునః పునః

సంసార సాగరం దుఃఖం తస్మాజ్జాగృధ జాగృధ||

అని శ్రీమజ్జగద్గురు ఆది శంకరులు బోధించియుండిరి.

1. జన్మ 2 జరా, 3 జాయ, ఈ మూడును దుఃఖ భాజనము అని జకారత్రయము బోధించుచున్నది. కాన బాగుగా గుర్తించి మెలంగుడు.

1 జా= జాయ= భార్య 2 జ గ్ర= సంసారాంబుధి యందు గ్రాహమువలె గ్రసియించును. కావున, 3 త= తత్త్వము నెరుంగుమను వర్థమును జాగ్రత = జాగ్రత్తయను పదము మనకు బోధించుచున్నది. ద్వితీయ తకారముచే, తత్త్వ పరిశీలన మొనరించి, తరించుమనియు, తెలుపు చున్నది. అని రెండవ హెచ్చరిక చేయుచున్నది.

2 ప్రాప్యవరాన్ని బోధత = వరాన్‌ = శ్రేష్టమైన, వేదాన్‌ = వేదములను, అనగా తెలిసికొనతగిన మంచి విషయములను, ప్రాప్య = గడించి, సాధించి నిబోధత = లెస్సగా తెలిసికొనుము. విద్యాసారమగు జ్ఞానమును గడింపుము. వరాన్‌ = శ్రేష్టమైన సద్గురువులను సేవించి, వాని నాశ్రయించి, వారి వలన, వరాన్‌ = శ్రేష్టమైన వేద విహిత ధర్మములను, కర్మములను, యోగములను జ్ఞానమును, నిబోధత = బాగుగా తెలిసికొనుము అనగా ఐహికమైన, ఇంద్రియ విషయ సుఖములను గురించి బాగుగా ఆలోచించి అవియన్నియు అనిత్యములని గ్రహించి వానిని విరమించి విచారణ బుద్ధితో, ఐశ్వర్యశాస్త్రమగు ఆధ్యాత్మికశాస్త్రమును 2= నితవా = లెస్సగా, బోధత, తెలిసికొనుమని మూడవ హెచ్చరిక. ఇదియే తాంతత్రయము.

ఇట్లు జకారత్రయమును విచారించి, తాంతమైన ఉపదేశత్రయమును, మూడు హెచ్చరికలను, తెలిసికొని, కృతార్ధుడవు కమ్ము అను భావమును కఠవల్లియను శ్రుతి శీర్షము మనకు వ్యక్తపఱచు చున్నది.

భారతావనియందు ఆర్యావర్తపుణ్య (కర్మ) భూమి యందు దాగియుండి, పండిత, భక్త, జ్ఞానయోగి పుంగవులచే అనుభవింప బడుచున్న అధ్యాత్మపరతత్వశాస్త్రము ఏ ఇతర ఖండములందును కానరాదు. అట్టి భాగ్యసంపద ఈ భారత దేశముననే కలదు. కావుననే గ్రీసు దేశ ప్రభవగు అలెగ్జాండరు మహాశయుడును, ఇటలీ నివాసియగు అనిబిసెంటు. ముస్లిము చక్రవర్తి సోదరుడు షికోహాయను నాతడును, భారతీయ ఋషులను సేవించియు, ఉపనిష చ్ఛాస్త్రముల పరిశీలించియు తనివినొందిగి. నేటివరకు అమెరికా వాసులును, భారతదేశమున కేతెంచి, ఇచటనుండు దేవాలయములను. భజన మందిరములను అమెరికాలో నిర్మించు కొనుచుండిరి.

మిత్రయము లేక మితత్రయమును, విషయమును గమనించుదురు గాక.

1 మిత భాషణము. దీని వలన కలహములు = తగవులు = పోరాటములు సంభవింపవు. మరియు ఆయువు పెంపొందునని, వైద్య శాస్త్రము యోగ శాస్త్రములు చాటుచున్నవి. పూర్వపు మహర్షులు మౌనము వలన వాక్పటి మను సాధించారు. మహాత్ముడు సోమవారము మౌన వ్రతమును పాటించి, ఆచరించుటచే వాక్పాటవమును గడింపగలిగి, యావద్భారతమును తన కైవస మొనరించుకొనగలిగెను. మౌన వ్రతము వలనను, మితసంభాషణము వలనను, వాక్ఛక్తి వృద్ధినొందును, అమితభాషణమున అనర్థములు వాటిల్లును. ఆయువు తరిగిపోవును.

2 మితాహారము ఇందుచే ఆరోగ్యము కలిగి, ఐహిక వ్యాపారమునకును, ఉపకారము కలుగును. అమితాహార స్వీకారముచే ఆరోగ్యము చెడి, రోగములు జనించి, అనారోగ్యస్థితి ఏర్పడును. అమితాహారము వలన జీర్ణశక్తి తరిగి వాంతులును, విరేచనములు కలిగి ప్రేవులకు బాధ జనించును. జఠరగ్ని చల్లారును. ఉదరవ్యాధికలుగును. మితాహారము మితభోజనము సమానార్థకములు.

3. మితవ్యయము. ఇందుమూలమున వృధావ్యయము లొనర్చి ఋణములు చేసి. ఋణదాతలవలన బాధలుపడక సుఖింపవచ్చును. అమితవ్యయమున విషయానందములను అనుభవింపవచ్చును గాని, ధనవ్యయము, బుద్ధివ్యయము బలవ్యయము, కలిగి ఇహవరములకు దూరుడగును.

''స్మతి భ్రంశాద్బుద్థినాశః బుద్ధినాశాత్ప్రణశ్యతి = అని గీతమాత వచించెను. ఆత్మవిషయకమైన ఆలోచనా వ్యయము చేయుము దానిచే మేలుకలుగును. ఇతరమైన ఆలోచనా వ్యయమువలన బుద్ధి నాశము, సర్వనాశము జరుగకతప్పదని గుర్తింపుడు. ధనవంతుడు త్యాగహీనుడయ్యెనేని లుబ్ధుడనబడును. ధనహీనుడు త్యాగశీలుడగుచో, దుబారావా డన బడును. కాన మితత్రయము 1 మిత భాషణము 2 మితభోజనము 3 మితవ్యయములను సాధనలములోనుంచిన ప్రజా సంతతికి మేలు కలుగును ఇతి మిత్రయము లేక మితత్రయము అనబడును.

= అసత్తు=అనాత్మమువలనను, త=తపస్సు=చీకటి=అజ్ఞానమువలనను, మృ = మత్యుభయము ఏర్పడును. కనుక అక్ష్యుపనిషత్‌ ఇట్లు చెప్పెను. సద్వస్తు విచారణచేతను, జ్ఞానదృష్టి చేతను, మృత్యుభీతి తొలగును.

1. అ=అసతోమా సద్గమయ

2. మృ=మృత్యోర్మా అమృతంగమయ

3 త=తమసోమా జ్యోతిర్గమయ

అను ఋక్కు మూలమున మొదటిపుటలోని 1,3,2, వాక్యముల అద్యక్షరముల కలయికచే అమృతశబ్దము సూచింపబడుచున్నది. మృతము=చనిపోయినది. న+మృతము=మృతముగానిది అమృత మనబడును ''త్యాగనైకే7మృతత్వమానశుః'' అను శ్రుతిశీర్షము కలదు. ''అయాచితం స్వాదమృతం'' అని కలదు. ''యత్తుచంచలతాహీనం తన్మనో7 మృతముచ్యతే'' అని మహోపనిషత్తునందు కలదు. త్యాగంచే నమృతత్వమును పొందుదరనియు, యాచించని పదార్థము అమృతమనియు, చంచలములేని మనస్సు అమృతమనియు, పై మూడు ప్రార్థనా వాక్యముల ఆదివర్ణముల కలయికచే అమృతశబ్దమును సూచించుచున్నది.

ఆర్యావర్తమునగల దక్షిణ భారతమున వైష్ణవ మతం, కర్ణాటకమున శైవము కలకత్తా ప్రాంతమగు వంగరాష్ట్రమున శాక్తేయము, మహారాష్ట్ర మన గాణాపత్యము, మధ్య భాగమున సౌరము, అను మతములు బాగుగా వ్యాప్తిలోనున్నందున శ్రీఆదిశంకరాచార్య గురువరేణ్యులు సర్వులకును పంచాయతన పూజను సగుణారాధకులకు నిర్ణయించిరి. పిమ్మట నిర్గుగణారాధకులుకు అద్వైతమత సిద్ధాంతమును నిర్ణయించి యుండిరి. మతం లేదు- గితంలేదు- కులం లేదు- గిలం లేదు అని ఆధునికులు అనినను, మతము లేని దేశము గాని కులము-మతము లేని మానవుడు గాని ఒక్కడును లేడు. కులమనగా గుంపు. రాజకీయమునందు మతము-కులము ఇమిడియే యున్నది గదా!

1 శైవమతస్థులగు లింగధారులు=ఆరాధ్యులు=అయ్యవార్లు=బ్రాహ్మణ మహేశ్వరులు= యతులు=లింగబలిజ=శెట్టిబలిజ, బలిజ, జంగమదేవర= వీరముష్టులు= శూద్రులలో వడ్డెర= చాకలి= వీరందురును చైతన్యము తొలగినపుడు శరీరములను విమానములో కూర్చుంబెట్టి సమాధి స్థలములకు గొనిపోయి భూమియందు గర్తముననుంచి శివలింగమును చేతనుంచి, పూజించి, నివేదన చేసిన భక్ష భొజ్యములను గాని, కనీసము తుదకు గుడమునుగాని, సర్వశైవ భక్తులును భుజింతురు. మృతుడైన వానికి లింగ (శరీర)భంగమై, శివలోకమున శివునితో నుందురని భావము. మృతుని, లింగైక్యము నొందెననియు, కైలాసమున కేగెననియు, నందురు. ఝ''శివాదన్యం నవిద్యతే'' శివునికంటె వేరొకటిలేదు. శివునిలో లింగశరీర మైక్యమైన దున వారికి పునర్జన్మంబు లేదని వారి మత విశ్వాసము, ''కోటిజన్మార్జితైః పుణ్యౖఃమయ (శివే) భక్తిః ప్రజాయతే'' అని శివగీతలందు 15వ అధ్యాయమున తెలుపబడి యుండెను.

2. ముస్లిములు= ఇస్లాము మతస్థులు మృత కళేబరములను నూతన వస్త్రములను, అ త్తరు పన్నీరులతో నలంకరించి, భూగర్భమున భద్రపఱచెదరు. వారిని, అల్లా, (ఖుదా) లేక మతాధి దేవతగాని, మత ప్రవక్తయగు గురువుగాని వచ్చి జలమును ప్రోక్షించి, జీవులను మరల శరీరములందు ప్రవేశ##పెట్టి మృతకళేబరములను సజీవులనుగ నొసర్చి బ్రతికింతురని మతగురువులగు ఖాజా, మౌల్వీ అందురు. కాన వారికిని పునర్జన్మము కలదనియే కొరాన్‌ అంగీకరించుచున్నది గదా!

3. క్రైస్తవులు (ఈసా) మతస్థులును మృతదేహములను నూతన పేటికయందుంచి భూగర్భమున భద్రపరచెదరు. జీసస్‌ క్రైస్తుగాని, మతప్రవక్తయగు దేవుని కుమారుడు అగు ఏసుప్రభువు గానివచ్చి మృతకళేబరములను, సజీవులను చేసి, వారి పాపపుణ్య విచారణమును చేసి, శిక్షించి, పవిత్రులనుగా చేయుదురాని తెలుపుదరు. ఇట్లు వారి బైబిల్‌ గ్రంథమున గలదని యందురు. కాన ఈసా మతస్థులుకును పునర్జన్మము కలదని వారి బైబుల్‌ అంగీకరించుచున్నది గదా!

4. హిందువులందు శరీరములను వదలిన దేహులు వారి వారి పుణ్యపాపకార్యాను గుణముగ లోకాంతరమందు యమదండనల ననుభవింతురు. కుమారులు చేయు ఉత్తర కర్మాను గుణముగ పైశాచిక దోషములను పోగొట్టుకొని, ఉత్తమలోకముల ననుభవించి, ''క్షీణపుణ్యమర్త్యలోకం విశంతి'' అనుటచే ఆలోకాంతరమున పుణ్యము క్షీణింపగనే మరల మనుష్యలోకమున చేరుదును ''శుచీనాం శ్రీమతాంగే హేయోగ భ్రష్ఠో7భిజాయతే!'' భ.గీ. పవిత్రమగు నడవడిక గల శ్రీమంతుల ఇండ్లలో గాని, యోగిశ్వరుల ఇండ్లలో గాని, ఆచార సంపదగల పేదలగృహమునందుగాని జనింతువని భగవద్గీత తెలుపుచున్నది. భక్తియోగులుగగాని, జ్ఞానయోగులుగ గాని, యోగభ్రష్టులు జనింతురు. కాన పునర్జర్మము కలదని ఇందువలన తెలియుచున్నది. పురాణములందును ఉపాఖ్యానములందును ఇతిహాన కధానికలందును బహుళదృష్టాంతములు గలవు. మృతులగు జీవులు మరల దేహధారులయి భూలోకమున జనింతురని తెలియుచున్నదిగదా!

5 వైష్ణవులు (శ్రీవిశిష్టాద్వైత మతస్థులు) హరినామ స్మరణమును చేయుచు తనువును వదిలినచో, నిరజానదిని తరించి వైకుంఠమునకేగి విష్ణుసాయుజ్యము నొందెదరని వారందురు

''లోకంబులు-లో కేశులు-లోకస్థులు- తెగినతుది, నలోకంబగు పెంజీకటి కవ్వలినుండు నేకాకృతినున్న వానినే సేవింతునే'' అని కలదు, కాన లోకములును, లోకాథిపతులును, లోకనివాసులును, కొంత కాలమునకు నివశించిన పిదప గొప్ప చీకటికి-అంధకారమునకు పిమ్మటనుండు, మహా వెలుగులో ప్రకాశించుచు, నేకాకారముగానున్న అద్వైతపరబ్రహ్మమును నేను సేవించుచు, అనగా నేను-నేనుగా నగుదునని భావము (ఇట్లు భాగవతమున గలదు.) అలోకము- అరూపము- అనామము, అనంతము- అనాదియగు బ్రహ్మానంద వారాశిలో లీనమగుదునని భావము అనగా బ్రహ్మీభూతుడ నగుదునని యర్థము (ఇట్లు గీతలందు భోదింపబడెను?)

మనము జన్మించినది హర్మ్య నిర్యాణమునకు గాదు. గృహములను చౌకధరలకు క్రయమునొంది అన్యుల కద్దెలకిచ్చి ధనము నార్జించుటకు కాదు వడ్డీల కొసంగి ధనమును వృద్ధి చేయుటకు కాదు. కొద్ది మొత్తము నిచ్చి హెచ్చు మొత్తమునకు నోటు వ్రాయించుకొని ఇతరులను మోసగించుటకు కాదు. తోటలనువేసి పెంచి వాని ఫలములను విక్రయించి ధనమును చేకూర్చుటకు కాదు. బ్యాంకులలో భార్యా పిల్లల పేర నిలువ చేసికొని మురియుటకు కాదు. వివిధ విద్యలు బాగుగా నేర్చి అన్యులను మోసగించి సిరిసంపదల నార్జించుటకు కాదు. నేర్చిన విద్య వలన దీనులకును, యాచకులను, పండితులను, కవులను, తాను ధర్మముగా నార్జించిన విత్తమును సత్కరించుట, మేలును కలిగించుటయు ముఖ్యము జేబులను కత్తెరించి పరులను, సాటిసోదరులను మోసగించి, పీడించి, ఏడ్పించి, ధనమును సముపార్జించుటకు కాదు. దీనముగా ప్రార్థించి, భూములను కౌలునకు, మక్తాకు, తీసుకొని అటు పిమ్మట భూస్వాములను, దుఃఖముల పాలుచేసి ఆ భూములను అపహరించుటకు కాదు. తాకట్టు పెట్టుటకు కాదు పరవని తలను తనమాట నేర్పుతోను, రూపలావణ్యములతోను, ఆకర్షించి వారి సౌశీల్యమును, భంగపరచి, వారి ఆశ్రమములను అపవిత్రమొనర్చి, వారిని ఉపభోగించుటకు కాదు. మిత్రులను, అనాథలను, అమాయ లను మోసగించి, నా యింట శుభకార్యమనియో, గృహనిర్మాణమనియో, తెలిపి దైన్యముగా అడిగి అప్పుగా తెచ్చి వారలకు సొమ్ము ఇవ్వక ఏడిపించి, ఐ పి పెట్టుటకును, దివాలా తీయుటకును, కాదు సుమా! ఇతరులను ఎదిరించి, బెదిరించి, దౌర్జన్యముగా గాని దుండగము వలనగాని, వారి నివేశనములను, స్థలములను, మ్రుచ్చిలుటకు మాత్రము కాదు. మరి ఎందుకనగా- జన్మించి నది చచ్చుటకు మాత్రమే అని బాగుగా గ్రహింప వలయును సుమా! చచ్చుట ఎందులకనగా- అది నీ పుట్టుక వలన జరుగును, పుట్టుటవలన మరణము, మరణము వలన జననము అవిచ్ఛిన్నముగా జరుగుచుండును.

సత్రవును నిర్మించి ప్రజలకును, పాంధులకును, యాత్రికులకును, ఉపకార మొనర్చుటయు, పాఠశాలలను, నిర్మించి, విద్యార్థులకు విద్యాదాన మొనర్చుటయు, తోటలను వేసి పెంచి పక్షులకును, శాఖామృగములకును, పాంథులకును, ఉపయేగించినట్లు వేసినతోటలను, ధర్మముగా వదలుటయు, విధ్యలను, శాస్త్రములను నేర్చి, ఇతరులకు తెలిసిపోవుననెడి మాత్యర్యగుణమును వదలి, లోకులకు హితబోధచేయుటయు, న్యాయముగ ధనము నార్జించి (ఆ ధనమును త్యాగశీలతచే దానము చేయవలయును) దీనిజనులకు వినియోగపరచుటయు, మధ్యేమార్గమున, బావులను త్రవ్వించి, మార్గస్థులకు సహాయ పడుటయు, చెరువులను పోయించి పైరులను, జంతువులకును, జనులకును సహాయ మొనర్చుటయు, అనుత్కార్యములను, చేయుచు, పాపకార్యములను విరమించుటయు చేయుచు, మనము మానవులమై జన్మించుటకును, మానవత్వమును రక్షించు కొనుటయకును, తుదకు మృతినొందుటకు మాత్రమే యనియు, ప్రతివ్యక్తికి, మరణమేశరణ్యమనియు, మనకు ఇష్టం లేకున్నను,మరణ మనివార్యమనియు, ఐహిక గమ్యస్థానమనియు వ్యావహారికముగా బోధపడుచున్నది.

నిదాఘుడను ఋషికుమారుడు సార్ధత్రికోటి పుణ్యతీర్ధయాత్రలను చేసికొని, సర్వవిద్యా పారంగతుడై తీర్థయాత్రా జనిత పుణ్యఫల ప్రభావమున, ఒక విచారము మనమున జనించినది, ఏమని?-

శ్లో|| ప్రాదుర్భూతో నునసిమే| విచారస్సో7యమీదృశః|

జాయతేమృతయేలోకో| మ్రియతేజననాయచ||

అస్థిరాస్సద్వేవేమే| నచరాచర చేష్టితాః|

శామ్యంతీదంకధం దుఃఖ మితితప్తో7స్మి చేతసో||

ఇతిమహోపనిషత్‌-

జనించుట మృతికొరకేయనియు, మృతినొందుట మరల జననము కొరకేయనియు, చరములు, అచరములు, అగు జీవుల చేష్టలిట్లు కాననగును. అవి యన్నియు నస్థిరములేయని నా మనమునందు ఇట్టి గొప్ప విచారము కలుగుచున్నది. ఈ విచారము ఎట్లు ఉపశమించును- అని మిక్కిలి పరితపించుచుంటినని, పలుకుచు, ఋభువు అను తన తండ్రియగు ఋ షి పుంగవుని; కుమారుడగు నిదాఘుడు ప్రశ్నించెను.

శ్లో|| ప్రాప్యం సంప్రాప్యతేయేన| భూయోయేన, నశోచ్యతే|

పరయానిర్వృతేఃస్థానం| యత్తజ్జీవితమచ్యతే||

తరవో7పి హిజీవంతి| జీవంతి మృగపక్షిణః||

సజీవితమనోయస్య| మననేనోప జీవతి|

జాతా స్త ఏవజగతి| జంతువ స్సాధుజీవితాః||

యేపునర్నేహ జాయంతే| శేషాజఠరగర్థభాః||

ఇతిమహోపనిషత్‌.

ప్రాప్యమైన స్థానమును ఎవరు పొందెదరో, మరల ఎవరు ధుఃఖింపరో. నిర్వాణస్థానమును (ముక్తిని) ఎవరు పొందెదరో, అదియే జీవితమని భావము. వృక్షజాతులు, పక్షిజాతులు, మృగజాతులు జీవించుచున్నవి. ఎవరి మనస్సు మననముచే జీవించుచుండునో, వారే జీవించినవారు, వారి జీవితమే మంచి జీవితము గలవారు. అనగా పుట్టినవారు మరణము లేకుండా ఆత్మను మననము చేయువారి జీవితమే జీవితమని భావము. మరియు మృతినొందిన పిమ్మట మరల జనింపకుందురో, వారి జీవితమే నిజమైన జీవితమని భావము, అనగా మరణము నొందిన పిమ్మట, మరల జననము నొంది, మరల మృతి నొంది, మరల జనింపకుందురో, వారి జీవితమే నిజమైన జీవితమని భావము. అనగా పుట్టినవారు మృతినొంది, మరల పుట్టకుండుటయు, చనిపోయినవారు మరలపుట్టి చచ్చుట జరుగక యుందురో, వారి జీవితమే సాధుజీవితమని భావము. మిగిలినవారు గర్ధభ జన్మసదృశులని తాత్పర్యము. ఇట్లు మహోపనిషత్తు తెలుపును.

జనించినవాడు మృతినొందుటయు, మృతినొందినవాడు మరల వేరొక శరీరమును (ధరించి) ప్రవేశించి, జనించుటయు, జరుగుచున్నది. ఇది వ్యావహారిక సత్యము కావచ్చును. కాని పారమార్థిక సత్యము కాదు. వ్యవహారమగు జగత్తంతయును మిధ్యదబ్బర, వట్టిది, హుళక్కి, అసత్యము, అవిద్య, అనృతము అజ్ఞానము, అబద్ధము, అనాత్మ, అని గ్రహింపదగియున్నడి. జన్మించుట మరల జన్మము లేకుండునట్లు చేసికొనుటకేయని రూఢిగా నిశ్చయించవలయును. మరణించుట, తిరిగి మరల జన్మించి, ఆ శరీరమును వదలుట మూలమైన పునర్మరణము లేకుండునట్లుచేసి కొనుటకేయని, ముఖ్యముగ నిశ్యయించుకొనుట; నిజమగు బుద్ధి లక్షణము. అనగా జన్మించుట జన్మరాహిత్యమునకును, మరణి చుట, మరణ రాహిత్యమునుకును, అయియుండుట మానవజన్మమునకు సార్థకమగును. ఆత్మావలోకనము, జీవిత లక్ష్యమని ఎరుంగవలయును, ఆత్మ శరీరమును వదులటయే, మరణము. ఇదియు వ్యవహారిక సత్యమే కాని పారమార్థిక సత్యము కానేరదు- అని గుర్తింపవలయును. నూతన శరీశములో ప్రవేశించుట జననము. వేరొక శరీరమున ప్రవేశించుటకు, పూర్వ శరీరమును వదులుట మరణము. శరీరముయొక్క మార్పుయే మరణ శబ్దమునకు నిజమైన భావము.

శ్లో|| నజాయతే మ్రియతేనాక దాచి| న్నాయం భూత్వా

భవితా వా నభూయః|

అజోనిత్యశాశ్వతో7యం పురాణోనహన్యతేహవ్య

మానే శరీరే|

భ.గీ.2అ, 2 శ్లో;

శ్లో|| నిత్యస్సక్వగత స్థ్సాణు రచలో7యు సనాతనః |

భ.గీ. అ2, 24శ్లో,

శ్లో|| నోదేతినాస్తమేత్యే కాసం విదేషా స్వయంప్రభా||

పంచదశీ-తత్త్వ వివేక ప్రకరణము, 7వ శ్లోకముగా

శ్రీవిద్యారణ్య స్వామివారు వివరించిరి. దీనిని పఠించి దీని భావమును గ్రహింపుడు.

ఈఆత్మ ఒకానొప్పుడును పుట్టునది కాదు. ఒకానొకప్పుడును చచ్చునదియు కాదు. ఈఆత్మ పుట్టి మరల చచ్చునదియును కాదు. ఈఆత్మ ఒకప్పుడు చచ్చిమరల పుట్టునది యును కాదుసుమా! ఈఆత్మ ఒకప్పుడు లేకపోయి అనగా ఇదివరకు లేక మరలపుట్టు (తిరిగిపుట్టి)నదియుగాదు.కావున

స్తి2జయాతే 3 వర్ధతే 4 విపరిణయతే 5 అపక్షియతే 6 నశ్యతి అనుషడ్భావ వికారములు లేనిది, ఆత్మపుట్టుక లేనిది నిత్యమైనది, అనగా చావు (మరణము) లేనిది, అపక్షయము=నాశములేనిది, వృద్ధిలేనిది. దేహము షడ్భావ వికారములను చెందుచున్నను, ఆత్మపరిణామమును పొందునది కాదు శరీరము మాత్రమే వికాసముల నారింటిని పొందుచుండును. పరిణామమును పొందుచుండును- అవి ముఖ్యముగ గుర్తింప వలసి యున్నది. ఆత్మనిత్యుడు, సర్వగతుడు, స్థాణుడు, ''చలుడు, సనాతనుడు, ఆత్మ ఉదయించునది, అస్తమించునది కాదు. దానిని జనన మరణములు లేవు సుఖదుఃఖములు లేవు. పాపము. పుణ్యములు లేవు. క్లేశములేదు. నిత్యసుఖమే కలదు, ఒకే ఒకటియగు జ్ఞానము స్వయముగా త్రికాలా బాధ్యమై ప్రకాశించునదియని చెప్పబడియున్నది. ఆత్మసత్యమై అనగా సన్మాత్రముగను, ప్రకాశాత్మకమై చిన్మాత్రముగను, అనంతమై ఆనందమాత్రముగను బృహద్రూపమై బ్రహ్మ మాత్రముగను, ప్రకాశించున్నది. బావులు, చెరువులు పోయించుట రూపమగు ఇష్టాపూర్తములుగను, అగ్నిచిత్‌, మహోగ్నిచిత్‌, సర్వతోముఖ, వాజపేయము, పౌండరీకము, వర్షపశువు, సత్రయాగము, మున్నగు క్రతువులను చేసిన పుణ్యాత్ములు, ఉత్తరాయణమునందును, శుక్ల పక్షమునందును' దివా భాగమునందును, మృతినొందినవారలు అనగా శరీరమును వదలిన వారలు, తమ ఇంద్రియములతోను, మనో బుద్ధులతోను, చేసిన శుభాశుభకర్మవాసనలను వెంటగొనిన సూక్ష్మశరీరము = లింగశరీరము=జీవనామములోనున్న చైతన్యము, ఉత్తరమార్గమ లేక ఉత్తరయానము, దేవయానము, శుక్లయానము, లేక అర్చిరాది మార్గము లేక శుక్లమార్గము, లేక యానము లేక శుక్షమార్గము, లేక విహంగమ మార్గమున ఉపాసనా మహిమ (ప్రభావము)చే, వైకుంఠము, స్వఠోకము, ఇంద్రలోకము, గోలోకము, సత్యలోకము, బ్రహ్మలోకము, వరుణలోకము, ప్రజాపతిలోకము, విద్యుల్లోకము, మున్నగు ఉత్తమలోకములకేగుదురు అనియును, పరహింస, పరద్రొహము పరపీడనము, మున్నగు పాపకార్యములను చేసిన పాపాత్ములు దక్షిణాయనమునందును, కృష్ణపక్షమునందును, రాత్రివేళలందును, మృతినొందినవారు అనగా దేహమును వదలినివారు తమ ఇంద్రియాలతోను మనోబుద్ధులతోను, చేసిన శుభాశుభ కర్మ వాసనలను వెంటగొనిన లింగ (సూక్ష్మ) శరీరము జీవనామముతో వ్యవహరింపబడు చైతన్యము, దక్షిణ మార్గము లేక పితృయానము లేక కృష్ణయానము లేక ధూమాది మార్గము, లేక వామదేవ మార్గము, లేక పిపీలికా మార్గము, మూలమున కర్మవాసనలచే అష్టావింశతి మహానరకములలో చేరిన, అగ్నిగుండము, అసిపత్రవనము, తైలద్రోణి, పున్నామ రౌరవము, మున్నగు ఘోరనరకములకేగుదురు. అనియును, ఛాందోగ్య- బృహదారణ్యక- కఠ- ఉపనిషత్తులును, భ.గీ. అ 8-23నుంచి 28వ శ్లోకములును, గరుడ, విష్ణు, మార్కండేయ, భవిష్య పురాణములును, ధర్మ శాస్త్రములును, కర్మ విసాకము, మున్నగునవి తెలుపుచున్నవి.

''ఆత్మ'' (ప్రత్యగాత్మ) సర్వాను స్యూతముగా. సర్వత్ర వ్యాపించియున్న, అధిష్ఠానచైత్యమగు పరబ్రహ్మమునకంటె భిన్నుడు కాడు. పరమాత్మ ప్రత్యగభిన్నుడు. దేహమే నేనని తలంచునట్టి అనాదియగు అవిద్యతో గూడి దేహేంద్రియ మనో బుద్ధులతో గూడి, అహంతా మమతాదులతో గూడిన అజ్ఞానముచే, మరుగుపడి రజ్జువునుగాంచి సర్పమనుకొనునట్లు, జగత్తే సత్యమనుకొనుచు, భ్రాంతిగొని (చైతన్యము) జీవుడు అని తలంపబడు చుండెను.

శ్లో|| కూటస్థే కల్పితాబుద్ధి స్తత్ర చిత్ప్రతి చింబకః|

ప్రాణానాంధారణాజ్గీవః సంసారేణ సయజ్యతే||

పంచదశీ-6వ ప్రకరణము 23వ శ్లోకము.

అగసాలె బంగరు నగలను చేయుటకు ఆధారమగు పట్టెడ (కూటము-దాగలి)వలె ప్రత్యగాత్మ నిశ్చలుడై స్థాణుడై, నిర్వికారుడై యుండును. ఆ కూటస్థునియండు అవిద్యా వశమున బుద్ధి కల్పించబడినది. ఆ బుద్ధియందు కూటస్థుని ప్రతిబింబము, చిదాభాసుడు అనుపేరుతో, ప్రాణములను ధరించుటచే, జీవుడని వ్యవహారిక నామము ఏర్పడినది. శిష్యులకు బోధించుటకు మాత్రమే నామము కల్పింపబడినది. కాని ఆత్మకు నిజముగా నామము గాని, రూపముగాని లేదు. అస్తి- భాతి- ప్రియములు మాత్రమే ఆత్మకు కలవు. నామ రూపములు జగత్తునకు మాత్రమే కలవు దేహి నిధ్రించునపుడు ఇంద్రియములన్నియు, వాని, వాని పనులను విరమించి అవిద్య=అజ్ఞానము అనియెడి కారణ శరీరమున (లింగదేహమున) హృదయాకాశమున, (హృదయకుహరమున, హృదయగుహయందు) చేరినట్లు మృతిసమయం బందుగూడ ఇంద్రియాదులన్నియును, చేష్టలుడిగి, వాసనలను వెంటగొని, లింగాత్మతో చేరి, ''ఆత్మ'' శరీరమును, వదులు చుండును. దీనిని పరలోక గతుడయ్యెనని సామాన్యముగా లోకులందరు. పరమ పదించెననియు, పరమపదమున కేగెనని వైష్ణవులందురు, బ్రహ్మీభూతులైరనియు, సిద్ధినొందరనియు యతుల విషయమున పలుకుదురు. కాల గర్భమున మునింగి చాటైరి యని కవుల విషయమున అందురు. లింగైక్యము నొందెనని శైవులు పలుకుదురు. సాధారణముగా చనిపోయెనని యందు. ''రమణీయ చరణాః రమణీయ యోనికూపద్యేరన్‌ః కపూయ చరుణాః కపూయయోని కూపద్యేరన్‌'' అని శ్రుతిశీర్షము కలదు. ప్రశస్తమగు కర్మనొసర్చినవారు రమణీయ చరణులు. అట్టి వారు ఉత్తమ జన్మము నొందెదరు: నిందిత కర్మలనొనర్చు వారు కపూయ చరణులు. అట్టివారు అధమయోనులయందు జనింతురు. అని ఉపనిషచ్ఛాస్త్రములు ఘోషింపుచున్నవి. మహా పాపాత్ములు ధాన్యాదులుగను, వృక్షాదులుగను జనింతురు మహోపాసకులు ముక్తావస్థయందు బ్రహ్మముతో నేకీభవించి బ్రహ్మీభూతులగుదురు. కాని వేరుగా నుండరు. మరణించిన వారందరును ముక్తులు కాజాలరు. వారివారి విజ్ఞానము ననుసరించి, మనుష్యులుగను, చరములగు పశుపక్షి మృగాదులుగాను, అచరములగు వృక్ష సస్యాదులుగను, జనింతురు.

''నతన్య ప్రాణాహ్యుత్క్రామంతి - తత్రైవ సమవలీయంతే. తత్రైవముక్తః'' అని కలదు. నిర్గుణ బ్రహ్మోపాసకునకు ప్రాణోత్క్రమణము లేదు. అవిద్యానాశమగుటచే జననమరణ రూప సంపార బంధవిముక్తుడై - అమ్మహోపాసకు డచ్చోటనే అనగా తానున్న స్థలమునందే, ముక్తుడగును. అతడే క్షేత్రమునకు గాని, ఏ పుణ్యతీర్ధమునకు గాని, ఏ పుణ్యస్థలమునకు గాని, పోవనక్కరలేదు. అతనికి ఎప్పుడెచట బ్రహ్మజ్ఞానము కలుగునో, అచటనే బంధవిముక్తుడగునని ఉపనిషత్తులు బోధించు చుండెను. ''నస పునరావర్తతే'' అతడు తిరిగి జన్మింపడు బ్రహ్మీభూతుడగును. అనగా బ్రహ్మమేయగునని భావము. సగుణ బ్రహ్మోపాసకుడు సత్యలోకమున కేగి అచట బ్రహ్మతోగూడ, కల్పాంతము వరకును, బ్రహ్మ నివాసమగు సత్యలోకముననేయుండి, సబల బ్రహ్మముచేయు, బ్రహ్మవిచారణ చేయుచు, వానితోడనే వాని ప్రవచనములను శ్రవణముచేయుచు, క్రమముక్తిని బడయగలుగును. ఇట్లు శ్రుతిశీర్షములు ఘోషింపుచున్నవి.

నదులన్నియును తమ జలముల రంగును, రుచిని, నామమును, రూపమును వదలి సముద్రమున ప్రవేశించి సాగరము యొక్క రుచిని, అలలను, పొందిన పగిది, బ్రహ్మవిదుడగు మహాత్ముడు, ఆగామి, సంచిత, ప్రారబ్థములను, పాపపుణ్య కర్మఫల వాసనలను విడచి, శుద్ధాత్ముడై బ్రహ్మప్రాప్తి నొందును. పరమ సుఖమనుభవించును. పరమశాంతిని పొందును. పరమ పరాంశాంతి మవాప్నుయాత్‌, అని భ.గీ. తెలుపుచున్నది. అనగా బ్రహ్మమేయని భావము. బ్రహ్మీభూతుడగు నని తాత్పర్యము

వ్యవహార దశయందు, తలితండ్రులను, తన్నుట, కొట్టుట, నిందించుట బాల్యమున తెలియక చేయుచుందురు. అది తప్పుపని దోషము పాపజనకము. వారిని పూజించుట గౌరవించుట, పోషించుట చేయతగినపని. ఇక జీవిత దశయందు వారు చెప్పినట్లు నడుచుకొనచు, వారి నాదరించి, సంతోష పరుచుట వలన మేలు చేకూరును. మృతి నొందిన పిమ్మట వారి శరీరములను దహనాది సంస్కార క్రియలుచేసి, శాస్త్ర విహిత కర్మకాండలను, దానధర్మములను చేసి గయాక్షేత్రమునకేగి, అచట పితృదేవతలకు పిండోదక క్రియలు చేయుట, 3 ప్రతి సంవత్సరమునందును పితృమాతృ మృతాహస్సునందు, దీనజనులకును, సాటివారిని, అర్హులను పిలిచి, భూరి భోజనముల నిడుటయును, పుత్రుడనువాడు, తన పుత్రధర్మమును నిర్వర్తింప వలయును సుమా! తలిదండ్రుల మృతకళేబరములను, దహింపక నిలువయుంచినచో, ఆ శరీరములు చీమలుపట్టి, పురుగులు ఏర్పడి, కుళ్ళి, వాసనకొట్టి, ఆ చెడు వాసనలకు, ఇంటివారలకే గాక ఇరుగుపొరుగు, వారలకును క్రమముగా గ్రామీణులకును, రోగములు వ్యాపించును. కొన్ని దేహములవలన అంటువ్యాధి లేర్పడును. దీనినే అంటు, మైల, ఆశౌచము, వచ్చినది అని లోకులు అనుచుందురు. కాన తలిదండ్రుల మృతదేహములను అగ్నియందు, దహనమును గాని, భూమియందు ఖననమును గాని, వేగముగా ప్రవహించు లోతైన నీరుగల నదులయందు విడుచుట గాని చేయుట పుత్రుని విహిత కృత్యమైయున్నది. అట్లు చేయుకున్నచో మానవ స్వీయసంఘమున నిందితుడగును. సంఘ దూరుడగును. అట్లు చేయకునికి, తన కుటుంబమునకును, గ్రామమునగల ఇతర కుటుంబముకు గాని హానీ జనించును. కనుక శాస్త్ర విథిని, అనుసరించి, ఉత్తర క్రియలను, కర్మ కాండములను, త్రండియనుకొనెడి జీవునకు ఉత్తమలోకములను పొందుచుండుటకుగాను, తిలోకద, పిండోదక, వాసోదకమును, మత్తికా స్నానములను, మున్వగు క్రియలను చేసి, దాన ధర్మములను, భూరి భోజన విరాళములను, సమారాధన ములను చేసి పితరులను తరింపచేసు ఉద్థరింపవలసిన భారము పుత్రులదై యున్నది ''ఇది యంతయును వ్యావహారిక దశ##యై యున్న''దని యెరుంగవలయును. వారు కని పెంచి వృద్ధిలోనికి తెచ్చినందులకు వారి ఋరుణమును పైన పేర్కొన బడిన విధమున తీర్చికొనివలయును. అట్లు ఋణమును తీర్చకున్నచో, తాను, (కర్త) ముక్తికి అర్హుడు కాజాలడు!

''యద్య దాచరతి శ్రేష్టస్తత్త దేవేతరోజునః భగీ. ఉత్తమ పురుషు డే ఏసత్కర్మ చేయునో, వానిని గాంచి ఆ సత్కర్మములను, వానిని మేలుబంతిగను, ఆధారముగను, గైకొని, ఇతరుడగు సామాన్యజనుడు శిష్టాచారముననుసరించి మంచిపనులను చేయుచుండును 1 ''సంఘం శరణం గచ్ఛ''అను సూక్తికి, భావమదియే సుమా! పరమార్ధ విషయమున ''అంతా మిధ్యజగంబు తలంచి చూచిన'' అను ధూర్జటి మహాకవి పలుకులను ప్రకటి చుచుండును సుమా! జగము అంతయును, భ్రాంతి, మిధ్య, భ్రమ, ఆభాస, అధ్యాస, అనాత్మ అనృతము, అబద్థము, అజ్ఞానము, అవిద్య, అని తలంపవలయును. తననుచూచి ఇతరులు చేయుటకుగాను, అనగా లోకసంగ్రహమునకు గాను, ఈకర్మ కాండలను కర్మకలాపములను విడువక చేయతగినవే కాని సర్వాత్మనావిడువగూడదు.

2''ధర్మంచరణం గచ్ఛ'' అనుసూక్తికి తాత్పర్యమిదియే సుమా! పరమార్ధ విషయమున ''ఉండేదే రామడొకడు, ఊరక చెడిపోకెమనసా'' అనియును, ''అంతారామమయం ఈజగమంతా రామమయం, అంతరంగమున ఆత్మరాముడు, అనంత రూపమును వెలుగుచునుండగ'' అనియును, భక్తశ్రీ, కంచెర్ల గోపరాజు అను భద్రాద్రి రామదాసు అను భక్తుడు కీర్తించెను ఆత్మారాముడు నిత్యుడు, నిర్వికల్పుడు, నిర్వికారుడు, నిర్విప్తుడు, నిరాకారుడు, నిరాభాసుడు, నిర్వారాముడు నిరంజనుడు, శాశ్వతుడు, సనాతనుడు, పురాణ పురుషుడు, స్థాణుడు, అచలుడు, అవినాశి, సర్వగతుడు, స్వయంప్రకాశుడు, అని గీతామాత పలుకుచున్నది. ''ఏకవేవా7ద్వితీయ బ్రహ్మ'' ''నేహనానా స్తికించన'' అని శ్రుతి శీర్షము ప్రకటింపుచున్నది. ''ఏకోదేవః కేశవోవా శివోవా'' యని పురాణములు చాటుచున్నవి, ''ఏకోవిష్ణుర్మహద్భూతం పృధగ్భూ తాన్యనేకశః'' అనియును, విష్ణుపురాణము. శివాత్పరతంనాన్యతే'' అని శివపురాణము, ''శివఏకోధ్యేయః'' అని ఉపనిషత్‌ పలుకుచున్నది. ఒకడేకలడు. ప్రత్యగ భిన్న పరమాత్మ సర్వాంతర్యామియై, అంతర్భాగముల వ్యాపించియున్న వాడు ఆకాశమువలె సర్వగతుడు పరమాత్మ, వ్యష్టిగత శరీరాభిమాని జీవాత్మనామమున, ''నీవలెనే, నీశరీరములోనునుండి, నీకును, ఇతరులకును, కానరాక యున్నట్లు అవిద్యా వృతుడై యుండెను సాక్షీమాత్రుడై కూటస్థుడు- ప్రత్యగాత్మయను నామముతో వ్యష్టిగతముగ నుండెను. అవిద్య (యోగమాయా వరణము)చే ఆవరింపబడి, దానిని మరచి, జీవభ్రాంతితో చిదాభాసుడను పేరున లోకమున శిష్యబోధ కొరకు వ్యవహరింపబడుచుండెను. సమిష్టిగతముగ సూత్రాత్మగను, అనుస్యూతముగను, ''సూత్రేమణిగణాన్నివ'' భ.గీ. వచనాను సారముగ మాయావృతుడై, నర్వులకు కానరాక వెలుగుచుండెను. మాయను దాటిన మహామహునకు సర్వత్ర కానవచ్చును. 3. ''బుద్ధం శరణం గచ్ఛ'' నిత్య- శుద్ధ- బుధ్ధ- ముక్త- స్వరూపిని పరమాత్మను శరణు పొందుమని తెలుపుచున్నది! పై మూడవ వాక్యము యొక్క భావమిదియే సుమా! చెప్పువాడోకడు, వినువా డొకడును వేరుగలేరు. చూచువా డొకడును, మాడబడువాడొకడును వేరుగ లేడు. అంతయును బ్రహ్మమయమే బ్రహ్మాకారమేయని స్థిర చిత్తముతో గాంచిన మహాత్మునకు మాత్రమే ముక్తి కరతలామలక మగును. అని గ్రహింపతగును.

1 గృహరాజ్యమునందు, యజమాని, వానికి సహాయరాలగు భార్యయు, భార్యకు సహాయురాలగు కుమార్తెగాని, కోడలుగాని, యజమానికి సహకరించు కుమారుడుగాని; అల్లుడు కాని, మనుమడు, మనుమరాండ్రుగాని క్రమ బద్ధంగా నడచుకొనుటయును, యజమాని చెప్పుచేతలలో మెలంగుటయును కుటుంబ వ్యవహార మనబడును 2 మరియు దేశ ప్రభువు, వానికి సహకరించి అన్వీక్షకీ, దండనీతి, త్రయా, అను శాస్త్రన్యాయ మెరింగిన మంత్రులు, ఉద్యోగులు గుమస్తాలు, నౌకర్లు, సేనానాయకులు, దండనాయకులు పదాతులు క్రమముగా నడచుకొనుటయు ఫండమెంటల్‌ రూల్సు ననుసరించి నడుచుకొనువారు, అడ్మినిస్ట్రేషన్‌నకు భంగము కలుగకుండునట్లు నడచుకొనుచు ప్రవర్తించుట రాజ్యాంగ వ్యవహారమనబడును. ఇది ఐహిక సుఖ ప్రదమగును. 3. దైవ సామ్రాజ్యమునందు ఫండమెంటల్‌ రూల్సు అను వేదములును శాస్త్రములును, వాని ననుసరించి ప్రవర్తించుటయు, పర మార్ధమనబడును. ఇది ఆముష్మిక (పరలోక) సుఖప్రదము.

పంచదార పాకమును, చిలుక మూసలో పోసినచో, చిలుక ఆకారమును, హంస మూసలో పోసినచో, హంస ఆకృతిని పొందినట్లును, సినిమాలో గోడలోని సన్నని రంధ్రం గుండా అమర్చబడిన భూతఅద్దముద్వారా వచ్చిన చిన్న బొమ్మ మనవెనుకనుంచి వచ్చెడి విద్యుత్తేజములో ప్రసరించుచు, మన ఎదుటనున్న తెల్లని (వెండివలెనున్న స్క్రీన్‌) తెరమీదపడి, పెద్ద బొమ్మగా మనకనులకు కానవచ్చు మాడ్కి, మనకన్నులందుగల తెల్లని గ్రుడ్డుపైనున్న, నల్లని (మద్దెల కరణివలెనున్న) గ్రుడ్డునందు మధ్య భాగమున గల సన్నని నీవార శూకమువలెనున్న, సూక్ష్మమైన కనీనికా (పాప) నడిమిభాగముగుండా సన్నని రంధ్రముగుండా ప్రసరించు చైతన్యము (వెలుగు= తేజము= ఆత్మజ్యోతి) పరమాత్మ యనెడి (యవనిక) తెరపై ప్రపంచాకారమును పెద్ద బొమ్మగా కనిపించినట్లు, విశ్వమంతయును, మనకనులగుండా ప్రసరించు చేతనాశ క్తియే సుమా! (ఆ చైతన్యము జాగ్రదవస్థయందు నేత్రమునందును, స్వప్నమున కంఠమునందును, సుషుప్తియందు హృదయ గృహయందును ప్రకాశించునని ఉపనిషత్తులు తెలుపుచున్నవి.) అనగా పరమాత్మ యనెడి= అధిష్టాన చైతన్య మనియెడి తెరమీదపడెను. అది విశ్వాకారమూసలోపడి విశ్వాకృతిని పొంది కానవచ్చుచున్నది. చూచునది (దృక్‌) చైతన్యమే. చూడబడునది విశ్వాకృతి నొందిన చైతన్యమే. కాన విశ్వమంతయును చైతన్యమగు బ్రహ్మాకారముగా కానవచ్చుచున్నదని విజ్ఞుడు గ్రహింపతగియున్నది సుమా! దృష్టిని జ్ఞానమయముగా నొనర్చి జగత్తును బ్రహ్మమయముముగా పరికించుము. దృశ్యమగు జగత్తును, అదృశ్యముగా నొనర్చి సర్వమును బ్రహ్మాకారముగా గాంచుము. ఈ అభ్యాసమే నిన్ను గమ్యమును చేర్చగలుగును. జీవుడును ఒక శరీరమున ప్రవేశించి బ్రాహ్మణుడనియును, మరియొక దేహమునచేరి క్షత్రియుడని, వేరొక కాయముననుండి వైశ్యుడనియును, ఇంకొక మేనునందుజొచ్చి శూద్రుడనియును వర్తకుడు, సేద్యగాడు, సేవకుడు, అని తలంచుటయు, వ్యవహరింప బడుటయు, అవిద్యా వశమున లోకవ్యవహారమునకే గాని, వేరు గాదు. పరమార్ధ విషయమున వ్యవహారమంత యును మిధ్యయనియే తలంపవలయును.

బ్రహ్మ మాత్రము సత్యము రజ్జుసర్ప భ్రాంతి, ఆకాశనీల భ్రాంతి, స్థాణుపురుష భ్రాంతి, మరుజల భ్రాంతి, దేహాత్మ భ్రాంతి, అనగా దేహమే ఆత్మయని తలంచుటయు, భ్రాంతియే దేహేంద్రియాది సంఘాతమునకన్న వేరగు చైతన్యము ఆత్మ- అదియే వరబ్రహ్మము. ''అంతా మిధ్యజగంబు తలంచి చూచిన'' అని ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వరస్వామి శతకమున వెల్లడించెను. ఈ పరిదృశ్యమానమగు జగమంతయు మిధ్యయే, అని ఆది శంకరులు బోధించి యుండిరి. కనుపించుచున్నట్లు ఉండునే కాని, విచారించి చూడగా శాశ్వతముగ నుండునది కాదు. మార్పునొండు స్వభావము కలది. అదియే మిధ్య. మిధ్య యనగా బొత్తుగా లేనిదియని అర్ధముకాదు. ఉన్న దానిని చూచి అది వేరొక వస్తువని భావించుటయే మిధ్యయని భావము. మార్పునొందు స్వభావము గల జగత్తునుచూచి, బ్రహ్మమని తెలిసి కొనకుండుటయే మిద్య- భ్రమ- భ్రాంతి- అధ్యాన, ఆభాస, అని తలంపవలయును. అదియే, పొరపాటు, అవిద్య- అజ్ఞానము-మాయ ప్రకృతి- అనియు చెప్పబడును. కాన సూర్యనకు ఉదయాస్త మయములు లేవు.

అట్లే జీవునకు ఉదయాస్తమయములు అనగా పుట్టుక చావులు లేవు. జీవునకు జననమరణ ధర్మముల లేవు. అవి నిజమును విచారించినచో, శరీరమునకే కలవు. కాని బాగుగా శాస్త్రముల ద్వారా విచారించి తెలిసికొనిన ఎడల శరీరమునకును అవిలేవు ప్రకృతి ధర్మమగు మార్పు మాత్రమే అనగా పరిణామము మాత్రము శరీరమునకు జరుగు చుండును. దేహమునకుమార్పుకలదని మాత్రము ఎరుంగవలయును. ఎట్లన- కామిలా (కామెర్ల అను కంటికి కలుగునొక) వ్యాధి జనించిన వాని నేత్రములకు జగత్తంతయును, పసుపుపచ్చగా కానవచ్చును. అట్లే భ్రాంతివ్యాధి కలవానికి దృశ్యజాలమునుగాంచి జగత్తు అని భావించి, భ్రమ వలన బ్రహ్మభావమును మరచి యుండుటయే జరుగుచున్న వ్యవహారము. లోకమున సామాన్య వ్యావహారిక దృష్టి=లౌకిక దృష్టివేరు. పారమార్థికమగు జ్ఞానదృష్టివేరు అని గ్రహించవలయును. ఇట్లు చూపు=దృష్టి రెండు విధములు

1. బాహ్యదృష్టి- 2. అంతర్దృష్టి

1. వెలిచూపు- 2. లోచూపు

1. అజ్ఞానదృష్టి- 2. జ్ఞానదృష్టి

1. వ్యవహారదృష్టి- 2. పరమార్థదృష్టి

1. ప్రపంచదృష్టి- 2. పరమాత్మదృష్టి

1. దృశ్యము 2. దృక్‌

1.వ సంఖ్యతో చెప్పబడినవి లోకదృష్టి,

2వ సంఖ్యలతో సూచింపబడినని ఆత్మదృష్టి అని భావమును తెలుపుటకు మాత్రము వ్రాయబడనది.

1. దృష్టిం జ్ఞానమయీంకృత్వా పశ్యేద్బ్రహ్మ

మయం జగత్‌. ఇతి తేజో బిందూపనిషత్‌.

దృష్టిని జ్ఞానమయముగాచేసి జగత్తును బ్రహ్మమయ మునుగా పరికించుము.

2. దృశ్యగ్‌ం హ్యదృశ్యతాం నీత్వా బ్రహ్మకారేణచింత

యేత్‌. తేజోబిందూపనిసత్‌.

దృశ్యజాలమును అదృశ్యమునుగా పొందించి,

సర్వమును బ్రహ్మకారమునుగా చింతించుచుండుము.

3. పరమాత్మన ఉత్పన్నం జగదాత్మైవనే తరత్‌

మృదాజాతో ఘటో యద్వన్మృద్వస్తేవ తధేక్ష్యతాం||

ఇత్యనుభూతిప్రకాశికాయా ముక్తం.

మన్నుతో నిర్మింపబడిన ఘటము (కుండ) మట్టి వస్తువేయగును. బంగారముతో నిర్మాణమగు నగలు బంగారు (స్వర్ణమయ) వస్తువులే యగును. వెండితోను, ఇత్తడితోను, రాగితోను, రాతివెండితోను, స్టీలుతోను, చేయబడిన వస్తువులు వెండివి, ఇత్తడివి, రాగివి, రాతివెండివి, స్టీలువి, యగును గదా! అట్లే బ్రహ్మము వలన నేర్పడిన జగమంతయును, బ్రహ్మమే= ఆత్మయే యగును. కాని అన్యము (వేరు) కాదుసుమా!

4. యత్సత్యం బ్రహ్మపూరోక్తం| తదేవ జగదాత్మనా|

భాతి భ్రాంత్యా తతస్సర్వం| బ్రహ్మేత్యాచక్షతే

బుధాః||

సత్యమగు బ్రహ్మము జగదాకారముగా ప్రకాశింపుచున్నది. కాన ప్రకాశించున దంతయును, బ్రహ్మమే అని గ్రహించుము. అని ఉపనిషత్తులు బోధించుచున్నవి.

5. ''మృత్యుస్తస్యనవిద్యతే'' అని యోగతత్వోపనిషత్‌. యోగి పుంగవునకు మృత్యువులేదని తెలుపుచున్నది. కాన యోగశక్తిచే ఆత్మతత్వము నెరింగిన (ఆత్మజ్ఞానమును గడించిన) మహాయోగికి మృత్యు (మరణ) భయములేదు. యోగసాధనములేని అవయోగికి మాత్రమే మృత్యుభీతి కలుగుచున్నది అని సారాంశము.

''ఆయుః పృధివ్యాం ద్రవిణం బ్రహ్మ వర్చసం|'' ''ఋషయో దీర్ఘసంధ్యత్వాద్దీర్ఘ మాయురా వావ్నుయుః'' ''ఓమిత్యేకాక్షరం బ్రహ్మ'' ''బ్రహ్మైవ సన్‌ బ్రహ్మాస్యేతి''

1. భూమియందు ద్విజో త్తములకు పూర్ణాయువు. (జీవించు టకు మాత్రము, బ్రహ్మను ఉపాసించుటకు మాత్రము, భోగములను అనుభవించుటకు మాత్రము కాదని గ్రహించుడు. జ్యోతిషశాస్త్రమున, ఖగోళమున గల నవగ్రహములనుబట్టి దశాసంవత్సరముల మొత్తము 12. అంత వరకు జీవించుటకు హక్కు మానవునకు కలదు. సరాసరి వయస్సు ''శతమానం భవతి శాతాయుః పురుషః'' 10 సం|| సరాసరిని వేదము నిర్ణయించినది. మనకిపుడు 28-32 సం||ల మధ్యనే సరాసరి జనభా లెక్కలవలన తెలియుచున్నది. కాన ఎంత ఆయువును కోలుపోవుచుంటిమో మీరలే (చదువరులే) యోచించుడు. మన యోగశక్తిని కోలుపోవుటయే ఇందులకు కారణమని తెలిసికొన వలయును). మనము బ్రతుకుటకు మాత్రము వలసినంత మాత్రము 2. ద్రవ్యము, 3 బ్రహ్మవర్చస్సును సంధ్యోపాసనమును చేకూర్చును. ద్ఘీకాలము సంధ్యోపాసనమును చేయుటచే మహర్షులు దీర్ఘకాలము ఆయుష్మంతులైరి. ఏ కాక్షరమగు ప్రణవ(ఓంకార)ము బ్రహ్మము. పూర్వము బ్రహ్మమైయుండి అవిద్యా వశమున మరచి, మరల దానిని ఉపాసించుటచే బ్రహ్మమే యగును, అని పై వాక్యముల భావము. ఆద్వంత రహితమైన, సనాతనమైన పరబ్రహ్మము నుపాసించుటయే సంధ్యలోని పరమ రహస్యం బ్రహ్మమును ఉపాసించుటచే అమృతత్వము గలుగును. ఇదియే దీర్ఘాయువు, దీర్ఘాయువు సంప్రాప్తించుటచే దీర్ఘ కాలము సంధ్యను ఉపాసించు, దీర్ఘకాలము విలసిల్లు బ్రహ్మభావమును పొందుటకు సంధ్యోపాసనము ప్రధాన మార్గమని ప్రభోధింప బడుచున్నది. ''ధ్వేవిద్వేవేదితవే -1 విద్యా 2, అవిధ్యా అవిగ్వయామృత్యుంతీర్త్వావిద్యయా అమృతత్త్వ మశ్నుతే'' ఇతిశ్రుతిః 1 అవిద్యా 2 విద్యా అని విద్యరెండు తెరంగులు. అవిద్యచే మృత్యవునుదాటి, విద్యచే అమృతత్వమునుదాటి, విధ్యచే అమృతత్వమును బడయవలయును అని శ్రుతిమాత బోధించుచున్నది.

జన్మమెందుకు? భక్తిలేని నరజన్మము అని త్యాగరాజు పలికెను.

''జాతస్యహిధృవోమృత్యః| ధృవంజన్మమృతస్యచ''

(భ.గీ. అ 2 శ్లో29)

''నిత్యం సన్నిహితో మృత్యుః| కర్తవ్యోధర్మసంగ్రహః|

పుట్టిన దేహమునకు మృత్యువు నిశ్చయము, మృత శరీరమునకు తిరిగి జన్మించుటయు నిశ్చయము. అని తెలపబడినది. ఎల్లపుడును, జనించినవానికి మృత్యువు అత్యంత సన్నిహితముగానే యున్నది. కాన చావు అనివార్యము, తప్పించుకొని వీలుకానిది. కనుక ధర్మకార్యములను చేయుచు ధర్మమును గడించుము అనియు తెలుపబడినది. మరణ శాసనమును వ్రాసేది వేఖరి ''జాతస్యహి ధృవోమృత్యుః'' (భగీ అ2, 27శ్లో) అనియే తన శాసన పత్రమును వ్రాయ నారంభించును. కాన పుట్టిన దేహము గిట్టుటయు, గిట్టిన దేహము మరల ఎచటనో, ఏదేశమునందుననో, ఏజాతియందో, ఏవీచ యోనియందో, ఏఉత్తమ యోనియందో, ఏవేళనో, ఒక తావున ఒగ గర్భమున పుట్టుట, తప్పదు. అను విషయము ప్రతివానికిని తెలిసిన విషయమే పుట్టిన దేహము గిట్టుట మనము, బహుళముగా చూచుంటిమి. కాని గిట్టిన దేహము మరలపుట్టుట, మనకు తెలియదను వారులేకపోలేదు, పుట్టిన దేహములు గిట్టుటను వారు చూచుచుండిరి, ఆగిట్టిన దేహములే తిరిగి పుట్టుచున్నవని వారికి విశ్వాసము హ్రస్వమగుటయే దీనికి కారణము శ్రుతిస్మృతులయందును, భగవద్గీతా శాస్త్రము నందును వారికి నమ్మకమే లేకుండుటయే దీనికి కతంబనక తప్పదు, ఉద్యోగీకి బదిలీ=తబాదలా=ట్రాన్సుపర్‌ ఒక తావునుంచి వేరొక తావునకు మార్పు జరుగు విధమున ప్రతి దేహమునకును, వెన్నంటియే మృత్యువు ఎల్ల వేళల కాచుకొనియే యున్నది ఉద్యోగికి దూరభూమిలేని చందంబున, దేహమునకు అనివార్యమై, ప్రాప్తించిన మరణానంతరం నందు, దూరప్రదేశమనునది లేక, ఎంత దూరదేశముననో, ఏ జాతియందో, ఏ మతమునందో, తిరిగి జనించుట, అనునది కలుగుచునే యుండును. అది సంభవించు చున్నదనియే, యున్నదను విషయము మాత్రం తెలిసియున్నను, మృత్యువు లేని వానివోలె. శాశ్వతుడనని తలంచుచు, చావు తప్పక కలుగునను విషయమును ఎరింగియు, అది ఎప్పుడు వచ్చునో తెలియనందున మరచి తెలియని వాని రీతి సంచరించుచుండెను. కాన దేహికి దేహము స్థిరము కాదని ఎరింగి, శ్రుతి విహిత కర్మములయందు భక్తికలిగి, పరాభక్తితో ధర్మకార్యము లందు ప్రవర్తింపుమని ప్రబోధించు చున్నది ఈపై శ్లోకము అని గ్రహించుడు.

వానరాకడయు, ప్రాణపోకడయు, నేరికిని తెలియదు గదా! తెలియకపోనేల? మేఘాడంబరముగానున్న సమయంబున, వానవచ్చుననియు, అట్లే దేహమునకు జబ్బు చేసిన సమయమున, మృత్యువు సంభవించుననియు తెలియవచ్చుచున్నది గదా! అందుచేతనే శరీరమునకు వ్యాధి జనించుటతోడనే వైద్యుని కడకేగి వాని సలహానుపొంది, అతడు నిర్ణయించిన ఔషధములను సేవించి మృత్యువును తప్పించుకొన యత్నించును. అనవచ్చును మృత్యుభయము వలననేగదా ఔషధసేవ చేయుట? యతులును, ఋషులును, పీఠాధిపతులును, దేహమునకు వ్యాధి కలిగినను, ప్రారబ్దానుభవము తప్పదని ఎరిగియే ఔషధ సేవ చేయక విరమింతురు పాము కుబుసము దానియంతట అదియే సమయము వచ్చిన, ఊడి పోవును అట్లే మనశరీరముగాని, దానికి వచ్చిన వ్యాధిగాని పారబ్ధకర్మనుగుణముగా తనకుతానే జారిపోవునని తలంచి ఋషివుంగవులు ఔషధసేవ చేయనొల్లరు. వారు జ్ఞానులు. సామాన్యజనులు భయముతో ఔషధసేవ చేయుచుందురు. ఇది అజ్ఞాన విలసితము, అని వారి భావము.

నాయనలారా! బ్రహ్మండమైన మబ్బుపట్టవచ్చును. వానపడక వాయువుచే మేఘములు కొట్టుకొనిపోయి వాన కురియకపోవచ్చును. అట్లే గొప్ప ప్రమాదకరమైన తిరుగులేని వ్యాధి కలుగవచ్చును. ప్రాణాపాయములేక జివింప వచ్చును. అట్లే మబ్బులు కానరాకయే తలవని తలంపుగా కుంభద్రోణవర్షము కురియవచ్చును. ఏమాత్రము వ్యాధి జనింపకయే, సుఖముగానున్న వానికి అవలీలగా తలవని తలంపుగా ప్రాణము పోవచ్చును గదా! ఏమని నిర్ణయింప గలము? ఇదయంతయును, భగవంతుని శాసనము. జీవుని ప్రారబ్ధాను గుణముగా యముడు చిత్రగుప్తుని లెక్కలను బట్టి కాలింగు బెల్లును మ్రోగించును. అపుడు కాలుడు వచ్చును. వాని ఆజ్ఞచే మృత్యువు వచ్చును. పిమ్మట దాని కర్మము వచ్చును. దాని ఆనతిచే కారు క్రిందపడియో, రైలు క్రిందపడియో, పాముకరచియో, నీటమునిగియో, నిమిత్తముగా చేసి మృత్యువు యమునికడకు జీవుని గొని పోవుచుండును. కాన యముని చేతిగంట మ్రోగువరకు, మనము ఎదురు చూడవలసినదే సుమా! మనము కోరిన అదిరాదు వలదనిన అదిపోదు.

ప్రతివానికిని తన దేహమున జీవుడు ఉండియు, వాని చర్మ చక్షవులకు కానరానందున లేడని పలుకుచుండిరి. నిత్యము ఛాయ (మననీడవలె) పోలిక మృత్యువు తన వెంట నంటి, కానుకొనియే యున్నను, మనకనుల ఎదుట ఎందరో పుట్టుచు, చచ్చుచు నుండుటను చూచుచున్నను, మృత్యువు ప్రతివానికిని అనివార్యమని తెలిసియు, తాను మిత్తిలేనివాని పగిది శాశ్వతుడనని తలంచుచు వ్యవహరించును. భార్య గుమ్మము వరకును, మిత్రులు ఊరిచివరివరకును, కుమారులు బంధుజనులు శ్మశానమువరకును వత్తురనియు, పాపపుణ్యములు మాత్రము తానెచటికి పోవునో అంతవరకు తన వెంట వచ్చుననియు తెలిసినను, తన ఇల్లు, వాకిలి, ఇల్లాలు, సంతతి ధనమూ, తోట, దొడ్డి, భూమి, వుట్ర, మున్నగు ఐహిక సంపద అంతయును, తన వెంటనుండునట్లును, తనతో శాశ్వతముగనుండుననియు, తాను స్థిరము కానుందుననియు తలంచుచు జీవుడు వ్యవహరించుచుండును, అందుకు కారణమేమి? అని ఒక గొప్ప సందేహము.

అందుకొక ముఖ్యహేతువు లేకపోలేదు. గమనించుడు. జీవునకు ముక్తావస్థ పర్యంతము తాను నివసించు దేహము నందును, దేహము నసించి ఇంటియందును, తనతో గూడ వచ్చిన సంసారమునందును తదాత్మ్యము నొందినందున జీవ భ్రాంతి యుండును. ముక్తావస్ధయందు కొన్ని జీవులకు జ్ఞానము కలిగి, నందువలన జీవభ్రాంతి తొలగి దేహి- ''దేహము జీవుడు'' కాదని ఎరుంగుటచే బ్రహ్మీభూతుడగును. దేహి=జీవునకు మృత్యువులేదు నిత్యుడు. అమృతుడు, అమరుడు, శాశ్వతుడు అధిష్ఠాన చైతన్యము అనుస్యూతముగను, సూత్రాత్మగను సర్వత్ర వ్యాప్తమై యున్నది. మృత్యువులేని జీవుని సాన్నిద్ధ్యము చేతను, దేహమునకుగూడ మృత్యువులేదని మానిసి తలంచుచుండును. సూదంటురాయి సాన్నిద్ధ్యమున జడమగు సూది ఎట్లు చలించుచున్నదో, అట్లే మృత్యువులేని ఆత్మసన్నిధిచే జడమగు దేహముగూడ చలించు చున్నది. అది జీవన సాసిద్ధ్య ప్రభావమే కాని వేరుకాదు. కాని జీవుడు దేహమునుంచి తొలగినపుడు దేహము మృత్యువాత పడునని తలంపడయ్యెను. అట్టి మృత్యువు దేహమున కెపుడు ప్రాప్తించునో,యను సమయ నిరూపణ మెరింగిన మహామహు లెచటనైన యున్నారా? అనినచో, బ్రాహ్మ సూత్రములలో జ్యోతిరధికరణమును చదివి, జీర్ణింప చేసికొనిన మహామహులకును, జ్యోతిషవిధ్య నెరింగిన శాస్త్ర పారంగతులను, పరమాత్మను నిరంతరము ఉపాసించ పరాభక్తి కలవారికిని, ఆ మృత్యు సమయము, ఘనవైద్యులకును స్త్రీ పురుష బేధము లేకయే తెలియబడును.

వ్యాస మహాముని రచించిన సూత సంహితయందు మృత్యు సూచక విషయములు విపులముగా 2,9,6,3,2,1, మాసములకు ముందుగను, 15,1,7,3,1. రోజులకు ముందుగను, మృత్యువు ఆసన్నమగునను విషయములు వర్ణింపబడియున్నవి. బ్రాహ్మణమూర్తి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రగారు రచించిన దత్తభాగవతము నందును వ్రాయుబడి యున్నది. జ్యోతిర్విదులు జీవుడు దేహమున ప్రవేశించు కాలమును బట్టియు, భూమిపై జన్మించినపుడును ఆయా గ్రహముల ననుసరించి మరొకగ్రహములను, మరొక సమయమున ఎరుంగ గలుగుదురు. ఆ గ్రంధములను చదివినచో సర్వులకును తెలియగలదు. వైద్యశాస్త్రమునందును, ఏ నక్షత్రమున, ఏవేళయందు, వ్యాధి జనించినదో, తెలిసికొన, ఫలాని నక్షత్రమున రోగమసాధ్యమనియు ఇన్ని దినములు ఈవ్యాధికి పరిమితమనియు తెలుపగలరు శాస్త్రములన్నియును ప్రతివారికిని తెలియుట దుర్లభము కనుక లోవివేకము అందరికిని కలుగుట లేదు. శాస్త్రములను చదువుకొనిన ఎడల సందేహము తప్పక తీరగలదు

1. తూర్పుగోదావరి మండలమున జమీందారీ దువ్వూరివారి ముక్కామలయను గ్రామంనందు బ్రాహ్మణ్యమూర్తులును. భమిడిపాటి సింహాద్రి సోమయాజులుగారు కలరు. వారు వర్ణక్రమషుని పాఠీలును, సాంగవేదాధ్యేతలున, వేదార్ధ ప్రవచన పటిష్ఠులును, బహుళయజ్ఞక కర్తలును, వైరాగ్యముకలిగి తుదకు తురీయాశ్రమును స్వీకరించిరి. వీరి దేహమునకు మృత్యు ఆసన్నమయ్యెనని జ్ఞానమార్గమున తామెరుంగుటచే తనే, సమీపముననున్న శిష్యవర్గమునకును, ఉపచార వర్గమునకును, తెలుపుటయేగాక, పూర్వాశ్రమమున తమ జేష్ఠ్య కుమారులగు పెద్ద నరసింహా వధానులు అను వేదవిదులను రావించి, యతి సిద్ధిపొందిన సమయమున శరీరమున వేగముగల ప్రవాహోదకమున ఎరింగించి, ఆపనులన్నియు పూర్తియయినవని, తెలిసికొని, వారు స్వయముగ దర్భలను పఱచుమని ఆజ్ఞాపించి, పిమ్మట వానిపై ప్రవేశించు సిద్ధి నొందిరి. అనగా అసువులను వదలిరి. తెలిసియే భీష్మాచార్యునివలె ప్రాణములు వదలిరి. స్వచ్ఛంద సిద్ధిని గడించిరి.

2. మరియు, పేరూరు అను గ్రామమునందొక సోమయాజులుగారు ఉండిరి. వారు ద్రావిడ బ్రాహ్మణులు. వారి భార్య క్రిందటిరాత్రి మృతినొందెను. సోమయాజులుగారు ప్రాతఃకాలమున స్నానమై అగ్నిహోత్రములను చేసికొని, ఉపాసనానంతరము వీధి అరుగుపై ఆసీనులగు సమయమున, ఊరివారెల్లరు అచట కేతెంచి, గృహస్ధాశ్రమధర్మప్రకారమును ఆదేశాచారము, ననుసరించియు, ద్రావిడాబారము ననుసరించియు, అయ్యా; సోమయాజులుగారూ! తమ అగ్ని హోత్రములు సోమిదేవమ్మగారిపాలు అయినవా? అని పరామర్శచేసి పలుకరింప జొచ్చిరి. అంతవారు- కాదునాయనా! నా పాలును అయ్యెనని తెలుపుచు, నాయనా! దర్భాసనమును పఱచమని పుత్రున కాజ్ఞనొసంగి, అతడు పరచిన దర్భాసనముపై పరుండి అసువులను అగ్నిహోత్రుల కర్పించిరి, శరీరమును వదలిరి. మృత్యు సమయమును తెలిసికొని స్వచ్ఛందమరణము నొందిరి.

3. ఎవరి మృత్యువును వారు తెలిసికొనుటయే గాక ఇతరుల మృత్యువును గూడ కనుగొను మహాత్ములు కలరా? వారును లోకమున లేకపోలేదు. వారణాసియందొక మహామహుడు అగు యోగి పుంగవుడు తాను గంగానదిలో స్నానమొనర్చి, సంధ్యాది నిత్య కృత్యముల నిర్వర్తించుకొని నీరమును పాత్రతోగొని వచ్చుచు, మెట్లపై నడచుచు, ఎండలోనేదో యొకవిధమగు తేజోభేదమును పరికించి, మహా దేవ! శివ,శివ, కృష్ట,కృష్ణ, యనుచు తన హస్తమున పాత్రలోని గంగాజలము నచ్చోటనే పారబోసి మరల మెట్లుదిగి గంగా నదిలోనికి దిగి స్నానముచేసి మెట్లు ఎక్కుచు పోవుచుండగా ఆ నదిగట్టుపై కూర్చుండియున్న మరికొందరు, అయ్యా, తాము స్నానముచేసి కొంతదూరము మెట్లపైకెక్కి మరల నీరుపారపోసి, గంగానదిలోనికి దిగి మరల స్నానమొనర్చుటకు కారణమేమి? అని వారు ప్రశ్నించిరి. నాయన లారా! నేను స్నానమొనర్చి మెట్లు ఎక్కుచుండగా సూర్య రశ్మియందొక ఇంచుక భేదము నాకు కానవచ్చెను. కారణమేమని సూర్యునివైపు చూడగా, ఇప్పుడే తూర్పు గోదావరి మండలమును ర్యాలియను మహాపుణ్యతీర్థమున విఠ్ఠాలనరును అను మహాయోగి పుంగవుడు సూర్య మండలమును భేదించుకొని సత్యలోకమున కేగుచుండెను. వాని ఆత్మ శాంతికై మరల గంగా స్నానమును చేసితినని వారితో పలికెను. నది యొడ్డున నున్నవారు ఆశ్చర్య చకితులైరి. అట్టి మహా మహులు మన దేశమున నుండెడివారు. ఇప్పుడట్టి భాగ్యము కరువైనదిగదా!

ఇప్పుడు మాత్రము లేకపోయారా? ఎండ్రిన్‌ త్రాగి మరణించువారును (ఎండ్రిన్‌ త్రాగించి మరణింప చేయువారును) ఎందరో గలరు అనువారును, కొంత సేపటిలో మరణమును, కనుగొనువారును కలరు అనువారు లేకపోలేదు. వారు పాపాత్ములు. వారి విషయము మనము స్మరింపనేల? కనుక విరమించుట క్షేమదాయకము.

నాడీజ్ఞానముగల వైద్య శిఖామణియు, హస్తమును గ్రహించి నాడిని పరిశీలించి, ఫలాని రోజున ఇతడు రేపుగాని ఎల్లుండిగాని మరణించును అని చెప్పగలుగును. కాన వాడీ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, నెరింగిన మహామహులకు వారి మృత్యువే గాక అన్యుల మృత్యువును తెలిసికొనగల నేర్పు కలదు.

4. తూర్పుగోదావరి జిల్లా నేదునూరునందు బ్రహ్మశ్రీ శ్రీధర వేంకటశాస్త్రి గారు అను జ్యోతిష్య పండితులు గలరు. వారు తమ అల్లునకు వ్యాధి జనింపగా వైద్యులు వైద్యము చేయు చుండిరి, నాయనా! వైద్య రత్నమా! నీవు ఎందుకు శ్రమ పడెదవు. ఇతడు రేపు 12 గంటలకు మృత్యువుపాలు కాక తప్పదనిరి వైద్యుడార్చర్యపడి, తాను ప్రయత్నించి ఇంజక్షనుల నిచ్చ ఒకగంటయైనను అదనముగా బ్రతికించ లేక పోదునా? యని ఘోర ప్రయత్నము చేసెను. కాని తాను మృత్యువును ఆపజాలక పోయెను. కాన అట్టి జ్యోతిష్కులు చెప్పగలుగుదురు.

''దూరస్ధం అంతికే చతుత్‌'' అవిద్వాంసులకు సన్నిధిలోనున్న ఆత్మ ఎంతయో దూరమందున్నట్లును, విద్వాంసులకు అత్యంత సమీపముననే యున్నదనియు, జ్ఞానము వలన తెలియును గదా! దీనికి (ఈ విషయము మనకు తెలియకుండుటకు) కారణమెయ్యవి? అవిద్యయే ఇందుకు మూలహేతువు. మన ఆయువు సూర్యుని ఉదయా స్తమయములచే దినదినము తరిగిపోవు చున్నది. మనము నిత్యము ఒక్కొక్క అడుగును తీసి ముందుకు, అనగా స్మశాన భూమికి అభిముఖముగా వేయుచు నడచు చుంటిమనియు, మరువక ధర్మమునకై యత్నించుడని ప్రభోధము.

ఓ గాయత్రీమాతా! నాలోని అవిద్య యనెడి యవనికను తొలగించి, నన్ను జ్ఞాన సంపన్నునిగ చేసి, నీయొడిలోనికి చేర్చికొని ''ఉశతీరివమాతరః'' అనినట్లు తల్లి బిడ్డలను పోషించుమని మహదీయ ప్రార్ధన- ఇదియే నాయంతిమ కోరిక నాలోని అవిద్యను వదలించుము.

మానవుడు పుట్టినది ఎందుకొరకు? యోచించడు, ''పుట్టుట- గిట్టుటకొరకే- పరిపూర్ణ సుఖంబు లధికబాధల కొరకే'' అని శతక కవులు బోధించియుండిరి. ఇది ఉపనిషత్సారమేయని భావించుడు. సందేహములేదు. మానవుడు జనించినది, సౌధ నిర్మాణమునకును, వాణిజ్యము చేయుటకును, న్యాయస్థానము నందభి యోగములు తెచ్చుటకును, రాజ్య పాలనమునకును, దీనజనులను, సాటిసోదరులను బాధించి పీడించుటకును, పరనారీమణులను ఉపభోగించుటకును, దుష్టుడనిపించుకొనుటకు, అన్యాయముగ ధనము నార్జించుటకును కాదు, ఎప్పటికైనను, ఎంత రక్షించి, పోషించినను, చచ్చుటకొరకే పుట్టితిమని తలంపుడు. ఇది నిశ్చయము. సుఖము కష్టము కొరకేయని తలంచుము. మరం=మృతిని; సయప్రాపణ=పొందుట- మరల అనగా తిరిగి శరీరమును పొందుట అను మార్పు అని భావము. మరణము మరల జననము. ''జననము మరల మరణము'' ఇట్లు సుడిగుండములో పడిన కీటకమువలెను, ఘడియంత్రము (ఏతమువలె) వలె క్రిందికిని పైకిని బండి చక్రపు ఆకువలెను తిరుగుటకు కాదు. అని శాస్త్రములు ఘోషింపుచున్నవి. సర్వ దేహములకును, మరణమే శరణ్యము. అది ఎంతటి వారికిని అనివార్యమైనది. మృత్యువు తప్పదు. అదియే గమ్యస్ధానము. ''మరణమనబృధమ్‌'' అది జీవితమనెడి యజ్ఞమువకు అవబృధ స్నానము వంటిది. అది మహాప్రస్ధానమునకు అంతిమ స్ధానము. పుట్టుక మరల జనన రహితమునకును, చచ్చుట, మరల మృత్యుదాహిత్యమునకును, అనియు ఆత్మావలోకనము జీవితపరమా వధియనియు, జీవిత పరమార్ధ మనియును, శాస్త్రములు బోధించు చున్నవి, మానవుడు ఏఏ కార్యము, కలాపమున కైనను, ఎంతయో కొంత సిద్ధపడి ప్రయత్నముతో నుండివలయును గదా!

1. ఒక ఆస్తికమహాశయుడు, దేవళమున కేగతలచినచో, ఒక టెంకాయయో, రంభాఫలమో, ఒక పైనయో, ఒక రూకయో, దక్షిణగ గైకొనిపోవ తలంచును గదా!

2. గురుని సన్నిధికేగ నిశ్చయించిన శిష్యుడు, ఒక వస్త్రముల చాపునో, ఫలములనో, ఆహారమునకు పిండివంటలనో, దక్షిణా సహిత తాంబూలమునో, గైకోనిపోవ సిద్ధపడును గదా!

3. రాజదర్శనమునకై పోదలచినవాడు, వెలగల రత్నములనో ముత్యములనో, కానుకగా గైకొనిపోవ నిశ్చయించుకొనును గదా!

4. గర్భిణీస్త్రీ కడకు వెళ్ళదలచిన ఎడల, పసుపు-కుంకుమ-కాచము(గాజు)లను చీరె-సారె-రెవిక-తినుబండారములను గాని తీసకొనిపోవ సిద్థపడియుండ వలయును గదా! గర్భిణీ స్త్రీకి చిరుతిండిపై అభిలాష మెండుగనుండును గదా!

5. బాలుని చూచుటకు పోవతలచినవాడు, ఆటవస్తువులనో బొమ్మలనో, బూరలో, తినుబండారములనో చొక్కా, లాగు, టోపి, మున్నగు దుస్తులనో, గైకొనిపోక సిద్థపడును గదా! బాలుడు ఆటవస్తువులను, చిరుతిండిని కోరును గదా!

6. సినిమాకుపోయి ఆ పిక్చర్‌ను చూడతలచిన వాడు, రాకపోకలకుగాను, రిక్షా చార్జీలకును, సోడా, కిళ్ళీ, కపీ,టీ టిక్కట్టుకును, కధాసంగ్రహమును తెలుపు పొత్తమును కొనుటకును, మిత్ర, కళత్ర, పుత్ర బృందమునకు సరిపడుద్రవ్యమును వెంటగొని పోవలసి యుండును గదా.

7. వైద్యుని కొరకు పోవలసిన ఎడల, టాబ్లెట్లునకుగాని, కేప్సిల్సునకుగాని, లిక్విడ్సునకుగాని, ఆయింట్‌ మెంట్సునకుగాని, ఇంజెక్షన్‌ బోటిల్సునకుగాని, రిక్షాలకుగాని, వారు చెప్పేడి సలహాల ననుసరించి, తగిన ధనమును వెంటగొనిపోవ సిద్థపడి యుండును గదా!

8. ఒకరోగి వద్దకు వైద్యుడు పోవలసినపుడు, అవసరమగు ఇంజక్షనులను, మందులను, సూదులను, గొట్టుములను, స్టెతస్కోపును, జ్వరమానిని, వెంటగొనిపోవ సిద్ధపడియుండ వలయును గదా!

9. అత్తవారింటికి పోవతలంచినవాడు, ఒక మిత్రునివద్ద బూడ్సులును, ఇంకొకని వద్ద సూటుకేసు అను పెట్టెయు, ఇంకొకని చొక్కా, వేరొకని పాంటును, షర్టును, ఇంకొకని వద్ద బంగారు గుండీలు, ఇంకొకనివద్ద గడియారము, రాయి వేసిన బంగారపు ఉంగరమును, ఇంకొకనివద్ద గుడ్డ గొడుగును, ఎరువు తేచ్చుకొనిపోవ సిద్దపడును. ఈ ఎరువు తెచ్చిన వస్తువులలో ఏదిపోయినను, కొన జాలనివాడు ఎట్లు కొని ఇవ్వకలుగును? ఎట్లు అచ్చుకొని బాకీ తీర్చగలడు? ఎరువు ఇచ్చినవాడు ''హరోహర'' యని విచారించుచు ఉపేక్షింప వలసినదే ఇట్టిదేశాచారములు గలుగు మనుజులును కలరు. (చూచిన విషయమిద, వట్టికల్ల కాదు.)

10. ఒక బంధు గృహమునకు పోతలంచిన వాడు, తన కుటుంబమునకు, భార్యా బిడ్డలకు నూతన వస్త్రములు, దుస్తులు, సేకరి చియు, నూతన వధూ వరులకు కట్న కానుకలకు వస్త్రములనో, ప్లెటులను, పెట్టెలను, బిందెలను, కొని యిచ్చుటకును సిద్ధపడియుండును. (ఈ పెట్టెను రైలులో పోగొట్టుకొనిన వారును ఎందరో కలరు.)

11. కాశికిగాని, రామేశ్వరమునకుగాని, బదరికిగాని, బదరికిగాని అమర నాథ్‌కు గాని యాత్రలకు పోతలచివారు. మార్గమున వంటకు వీలులేకనో, ప్రయాణములో సందర్భపడకనో ఆహారమునకు ఇబ్బంది గలుగును. అందులకై 1 అటుకులు 2 అరిసెలు 3 మినపసున్ని 4 జంతికలు మూటకట్టుకొని పోవుదురు గదా! అవి తిని నీరుత్రాగి ఆకలిని తీర్చుకొని ప్రయాణింతురు.

12. మరణము తప్పదని తన ఉత్తర క్రియలకు (కర్మకాండములకు) ధనమును ఒక మిత్రునివద్ద దాచి సమయమునకు కుమారుల కందించు మనెను. నాకు నీవు కర్మ చేయించుమని ఒక యాచకుని కోరును. వాహకులుగా నుండమని కొందరిని కోరుదురు. తోటలోని చింతచెట్టు నాకు కట్టెలుగా నుపయోగించుడని తెలుపును. ఇట్టి ప్రయత్నములు చేయువారును కలరు.

13. ఒక రసికుడు వారాంగన కడకేగ తలచినపుడు, మిఠాయి, కారపు బూంది, జిలేబి పొట్లములను, అత్తరు - పన్నీరు సీసాలను, చీర రెవికలను, ధనమును, క్రమముగా బంగరు భూషణములను, భూములు, తోటలు, ఇండ్లు, క్రమముగా అర్పణకై సిద్ధపడ వలసియుండును, అట్లుకానిచో వృద్ధ వేశ్యమాత గృహమునందు అడుగు పెట్టనీయదు. చింతామణి- విప్రనారాయణ- నాటకములను చూచిన వారికిని అనుభవము కాగలదు గదా!

14. అడవికి వెళ్ళి కట్టెలనుగొట్టి తేదలచిన వానికి, పదునైన గొడ్డలియు, త్రాడును సిద్దపరచుకొన వలయును. ఆవంట చెరకును ఇంటికి తెచ్చికొన తలచిన ఎడల, ఎడ్లు, బండి, కూలివానిని వెంటగొని పోవలయును.

15. భూమిని సేద్యముచేయ తలచినవాడు నాగలిని, ఎడ్లను, ముల్లుకర్రను, పగ్గము, పాదరక్షలు, సిద్ధపరచుకొన వలయును గదా!

16.నూతినుంచి బొక్కెనను పైకి తీయవలయుననినచో, గాలం త్రాడు కావలసియుండును. వానిని సిద్ధపరచు కొనునుగదా!

17. తోటలో పనిచేయదలచిన వానికి, చెప్పులు, పార, పలుగు గౌద్ధాళికము, గూడా సిద్ధపరచుకొన వలయును.

18. పాఠశాలకు పోదలచినవాడు, పలక, పుస్తకము, పెన్సిలు కలము, జామెంట్రీ పెట్టె, నోటుబుక్కులను ఒకసంచిలో సిద్థపరచుకొనును, ఇట్లెచటికి ప్రయాణించ తలచినను కొంత ప్రయత్న పూర్వకముగా, కొన్ని సాధనములను, భక్తి ధనములను, యత్నించవలయును.

19. ఇతడు 1 లేక 2దినములలో మరంణిచును అని వైద్యుడు తెలుపగనే, రోగి తన ఆస్తినంతటిని ఎవరెవరికి ఏమి ఇవ్వతలచినదన్నీ మరణ శాసనముద్వారా లేఖలిని పిలిపించి వ్రాయించ యత్నించును. కాని ఆత్మోధ్ధరణమునకు యత్నించువారు కానరారైరి. మరణ మనివార్యమని తెలిసియు, ఉత్తమలోక ప్రాప్తికినిగాని, ''తాను-ఉత్తమ పురుష'' వ్యాకరణమర్యాద తెలిసియు, ఉత్తమ పురుషుని చేరుటకుగాని, ఉత్తమ పురుషుడగుటగాని, అనగానేను ఎవరిని? నేను- నేనుగా ఆగుటకు మార్గమేమి? అను విషయ చింతనమునకు యత్నించుట మానవుని ముఖ్య కర్తవ్యము. భగవద్గీతలోని జ్ఞాన-మోక్ష సన్యాస-భక్తి కర్మ-పురుషోత్తమ యోగములనుగాని స్మరింపడుగదా! శుకునిరావించి పరీక్షితు భాగవత శ్రవణ మొనరించినట్టు చేయ సాహసింపడు గదా!

20. ప్రతి మానవునకును మరణమే శరణ్యమనియు, దానికి వశులముకాక తప్పదు, అని తెలిసియు, మృత్యుసన్నిధికేగు సమయమున ముఖ్యముగా కావలసిన, పరమార్ధవస్తు సేకరణమును చేసికొని సిద్ధపడయుండక, ఉపేక్షసేయుట ఎందులకో? తెలియరాకున్నది. అని శాస్త్రము ప్రశ్నించుచున్నది.

చావు తప్పదని ఎల్ల రెరింగియు, మరణ పర్యంతము ఐహిక తాపత్రయములతో బాధనొందురే కాని, దాన, ధర్మభగవన్నామ సంస్మరణ సంపాదనము చేయుట కానరాదయ్యెను. పారమార్ధికాపేక్ష ఏమాత్రము కలుగదయ్యెను. మరణమును చక్రవర్తిగాని, వైద్యుడుగాని, రాజకీయ నాయకులుగాని, ధనవంతుడుగాని, బలవంతుడుగాని, తప్పించుకొను వారు ఎవరయినా కలరా?

1. మృత్యువును జయించినవాడు ఈశ్వరుడుగాక మరి ఎవ్వరు గలరు?

2. మృకండు తనయుడగు మార్కెండేయుడు మృత్యువును జయించెను.

3. ఖట్వాంగ మహారాజు రెండు ఘటికలలో ముక్తిని కాంచ కలిగెను.

4. పరీక్షిన్మహారాజు వారము దినములలో సర్పదష్టుడై మరణించునని ముని శాపము నెరింగి, శుకముఖమున భాగవతాంధా శ్రవణమొనరించి ముక్తిని గాంచెనని భాగవతము తెలుపు చున్నది.

మరణ సమయమున ఏఏ భాగములను స్మరింపుచు ప్రాణములను విడచునో, ఆయా రూపములు మరు జన్మమున ప్రాప్తించునని గీతాచార్యులు సెలవునిచ్చిరి.

శ్లో|| యంయంవాసి స్మదన్‌ భావం త్యజత్యంతే కళేబరం

తంతమే వేతి కౌంతేయ సదా తద్భావ భావితః

||భ.గీ.అ. 8.6శ్లో.

1. జడ భరతుడను మహాయోగి లేడిని స్మరించుచు అసువుల వదలుటచే ముందు జన్మమున లేడిగా జనించినని భాగవత గాధ తెలుపు చున్నది. అది వ్యాసప్రోక్తమగుటచే విశ్వసింప వలసి యున్నది.

2. ఒక వేదాంతి దున్నపోతున్న స్మరించుచు ప్రాణముల నొదలుటచే, దున్నపోతుగా జన్మించవలసి వచ్చినది.

3. ఒక యతీంద్రుడు పాదరక్షలమీద మనస్సును నిలిపి మరణించుట వలన మరు జన్మమునందు రోహిందాసు అను చర్మకారునిగా జనించెను.

మరణ భయమేలేకపోయిన ఎడల మానవుడు దురితముల కడ్లుండునా? ధరణియందన్యాయ వాదుల ధనములకు నొడ్లుండునా? రోగ భయుమే లేకపోయిన భోగముల హద్దుండునా? రేగిచెనటులు చేయుబూనిన సేగులకు పద్దుండునా? యని హరికధా కధక పితామహ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి ప్రవచనము గలదు.

ఈలోకమున ప్రతిక్షణము కోట్లకొలది జీవులు దేహములను వదలి (మృతినొంది)లో కాంతరముల కేగుచుండిరి, దేహాంతరమున ప్రవేశించు చుండిరి. కాని చచ్చిన వారిని గాంచి మరుసటి దినమునుంచి యధాప్రకారముగా జీవయాత్ర సాగించుచు, తాము శాశ్వతముగ నుందుమనుకొనుచు, సంచరించుటకుగల ఆశ్చర్యకర విషయము ఇందుకు హేతువు గూడ లేకపోలేదు. శాశ్వతమగు నాత్మ జ్యోతి శరీరమున అంతర్యామిగా నున్నందునను, శరీరముతో తాత్మ్యాము నొందుటచేతను, నశించు జడమైన దేహముగూడ శాశ్వతిమని తలంచుచుండును. శాశ్వతుని సన్నిధి ప్రభావమే ఇందుకు హేతువు

నిరంతరము మనము మరణమునకు సంసిద్ధులమై యుండవలయును. దాని నతిక్రమింప వీలుకానిది అది తప్పదు ఎప్పుడో ఒకప్పుడు జీవితములో దానికి వశులము కావలసియే యున్నది. కాన మనము మృత్యుస్మృతిని కలిగియుండవలెనని తలంచు మానవుడు మిగుల పుణ్యాత్ముడుఅని తలంపవలయును. నిరంతరము మరణస్మృతి వేధించుచుండనిక పాపకార్యా చరణమునకు వ్యవధిలేదు, తీరికయునుండదు. మానసికముగను, వాచికముగను, కాయికముగను, పాపకార్య చరణముచేయ జాలడు. మృత్యుచేతలబట్టి యీడ్వబడిన వానివోలె పాపముల నొనర్చుట కవకాశ##మే యుండనేరదు గదా! ఒకడు వ్యాధి గ్రస్థుడుకాగా, వైద్యుడు నీవు రెండు మూడు దినములలో చత్తువు అని చెప్పగా, తనకున్న ఆస్తినంతయు భార్యకు, కుమారులకు, మనుమలకును ఎంత యీయతల చెనో వారలకా రీతిగా విలును వ్రాయ ప్రయత్నంలో నుండును. కాని ఐహికముగా ప్రాకులాడాలనేగాని, పరమార్థ చింతా ఆవంతయును, సామాన్యులకు లభింపజాలదు. నాయనా రేపు కోర్టు విచారణ వాయిదా కనుక సాక్షులతో హాజరగుడు. లేనిచో ఎగస్సార్టీ డిగ్రీని ఇచ్చెదరు సుమా! యని కుమారులకు చెప్పుచు చనిపోయిన వారుండిరి వారు కోర్టు ఆరాధకులు వారి జీవితమంతా, కోర్టుయే, స్వర్గము కోర్టుయే, మోక్షము అట్టివారెందరో లోకమున నుండిరి. వారి జీవితము కోర్టునకు అంకితము వారికి పరులు పిడించుటయే ఆనందము, అదియే వారి ఆశయము. శాశ్వతముగా నుందునని ధన, ధాన్యముల నార్జించుము. కాని మృత్యువు తలనుబట్టి యీడ్చుచున్నదని తలంచుచు దానధర్మముల చేయుచుండమని నీతిబోధ కలదు. తినుచు, తిరుగుచు, ఆడుచు, పాడుచు, భగవంతుని స్మరింపుమని ప్రహ్లాదుని వచనము భాగవతమున గాననగును.

శ్లో|| నైవకించిత్కదోమీతి యక్తోమన్యేత తత్త్వవిత్‌.

పశ్యున్‌ శ్రుణ్వన్‌ జిఘ్ర|న్నశ్నన్గచ్ఛడ్‌ స్వపన్‌శ్వన్‌|

ప్రలడన్‌ విసృజన్‌ గృహ్ణన్‌| ఉన్శిషన్నిమిన్నపి||

ఇంద్రియాణి ఇంద్రియార్ధేషు వర్తంత ఇతిధారయేన్‌||

భ గీ. అ5-8,9 శ్లో

చూచుచు, వినుచు, తాకుచు, వాసనచూచుచు, తినుచు నడుచుచు, ఊపిరివిడుచుచు, మాట్లాడుచు, మూత్ర పురీషముల వదలుచు, చేతితో ఏదేని గ్రహించుచు, కనుదెరచుచు, మూయుచు, ఇంద్రియములు ఇంద్రియ, విషయమైన పనులలో వర్తించుచున్నది. కాని నేనేమి చేయుటలేదు అని తత్తవత్త నిరంతర తత్త్వ చింతనలో నుండియే మెలంగుచుండును. అని గీతామాత పలుకుచున్నది. దీనిసారమే ప్రహ్లాదుడు వచించెనని భావము. తినుచు, తిరుగుచు, ఆడుచు పాడుచు, అనుటలో చేయతగిన పనులను ఇంద్రియములు చేయుచున్నను, తాను నేనేమి చేయుటలేదని తలంచుట తత్తవిదుని భావమేమి? కర్తవ్యపాలనము, నిరంతర భగవంతుని స్మరణము అను ద్వివిధ కర్మచరణములను గూడ ఒకే పర్యాయము జరుగుచునే యుండునని చెప్పక చెప్పుచున్నది. మాతృత్వము తన బిడ్డకు నీళ్ళుపోసి, పాలిచ్చి, ఊయలయందు పరుండబెట్టియును, బిడ్డ నిద్దురలేచి ఏడ్చు నేమోయని తన మనసును బిడ్డయందే నిలిపి, ఇంటిపనులను, అంట్లు చెంబులు తోముటయు, వంటకూరలు పచ్చడులు చేయుచు, గృహకృత్యములను నిర్వర్తించుచున్నది. బిడ్డమీద ధ్యానము, ఇంటి పనులను త్వరగచేయుట యను రెండు పనులను అనగా కర్తవ్య పాలనమును, ధ్యానమును మాతృదేవి ఎట్లు నిర్వర్తించు చుండునో, అట్లే మనముగూడ రెండు పనులను ధ్యానమును, కర్తవ్య పాలనమును చేయవలెను సుమా! మరణ సమయము మహాత్మడు, బాపూజీయను పిలువబడు మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధి ప్రియురాలగు శ్రీమతి కస్తూరీబాయిని గాని, ప్రియపుత్రుడగు అబ్దుల్లా గాంధిగాని ముఖ్య శిష్యుడగు జవహర్‌లాల్‌ నెహ్రు పండితునిగాని, రాట్నమును త్రిప్పుటనుగాని, తకిలీ వడుటకుగాని, హరిజనోద్ధరణమునుగాని, రాజకీయ సమస్యలనుగాని, అపక్వాహార విధానమునుగాని, దానియందుగల అపార మహిమనుగాని, ఆరోగ్యశక్తినిగాని తలంపకయే, రామ-రామ- రామ-యని స్మరింపుచు అసువులను విడనాడెను. అట్లంత కాలమున భగ వంతుని స్మరింపవలయుననిన ఎడల, నిరంతరము చిరంతనా భ్యాసవైరాగ్య పాటవములు లేనిది అట్టి మృత్యు కాలమున భగవన్నాను స్మృతి, ఒకరు జ్ఞాపకము చేసినను, కలుగజాలదు ''ఒరులు చెప్పినవైన, నిజేచ్ఛనైన కలుగనేరవు హరి ప్రబోధముల్‌'' అని ప్రహ్లాద వచనము కలదు సుమా! పూర్వకర్మ వశమునను, పుణ్య ప్రభావమునను, స్వయంకృషియు నభ్యాస పాటవముచేతను, ఈశ్వరకృపా కటాక్షమునను మాత్రమే అంతకాలమున భగవన్నామ స్మృతి కలుగును. ప్రాణప్రయాణ సమయంబున ఒక పర్యాయము నామమును స్మరించిన సులభముగా నుండునని భావింపరాదు. మరణ సమయమున మరణవేదనలో మనకు గుర్తురాదు. ఇతరును, గుర్తు చేసినను, స్మృతికిరాదు. కఫవాత, పిత్తదోపమలతోలు కంఠావ రోధమున మాట అగిపోవచ్చును. మనస్సు చంచలమగును. తాను కోరినను నోరు వచింపదు. మనస్సు మననము చేయదు. నిరంతర ధ్యానాభ్యాసమే అంతకాల భగవన్నామ సంస్మరణమునకు హేతువగును. సులభసాధ్యము కాదు. కష్ట సాధ్యమే. కావున నిరంతర భగవన్నామ సంస్మరణమత్యంతా వశ్యకమగును. నిద్రవచ్చువరకును, మృతి కలుగు వరకను, నామస్మరణము, తత్త్వచింతనము అవసరము.

తే. గీ. వేషమందున గర్వంబు - భాషణమున

ఎంత మాత్రము గూడదు - వింతగాదు.

తనకు తానెప్పుడును మెచ్చు-కొనగరాదు.

తనను మెచ్చుకొనంగను-వినగవలదు.

చెవుల రెంటిని మూయుము. పోవుమెటకో

పరుల దూషింప నెంతయు-పాడిగాదు.

పరుల నెప్పుడు మెచ్చును-పండితుడు.

ఇదియె సుజ్ఞాన మనియును-మదిని తలచు.

తే. గీ. ఏది పదముల నడుమను-ఎంచకలదో?

అదియు నీకడ నుండెను-నరయగాను

ఎంతమాత్రము నా యొద్ద-ఏది లేదొ?

దానికై నేను వచ్చితి-దాని నొసగు,

తే. గీ. పదులు నేడును పైనొండు-గదిసెవయసు

కంటికిని నాదు కలముకు-కాలనియతి

కానరాదయ్యె నేటికిన్‌ - కాలకంఠ

కరుణజూడుము నీవునన్‌ - కాతువంచు

కాచుకొనియుంటి నిన్ను నే-కామవైరి

కానవేగమె వచ్చిన&-కావుమయ్య

రుద్ర! శీఘ్రమే గ్రంథమున్‌-ముద్రణంబు

జరుగునట్టుల కరుణించు-జగతిదేవ!

గద్యము

కృష్ణా మండల మైలవర గ్రామ వాసులును, వేద విద్యాపారంగతులగు బ్ర. శ్రీ సూరవరపు వేంకట పూర్ణావధానులు గారికిని, పిచ్చమాంబగారికిని ఏకపుత్రుడును, బ్ర. శ్రీ. వేదుల లక్ష్మీనారాయణశాస్త్రి తర్క వేదాంత పారంగతులకును, వారణాసి సత్యనారాయణశాస్త్రి వైయాకరణా వతంనులకును, బ్రహ్మ విద్యాలంకార శ్రీ ముదిగొండ వేంకటరామశాస్త్రి తర్క వేదాంత పారంగతులకును, ప్రియాంతేవాసియగు సూర వరపు లక్ష్మీపతిశాస్త్రిచే రచింపబడిన జన్మతత్వ వివేకము, మృత్యుతత్త్వ వివేకము. మున్నగు వివేక పంచకము అను నీ గ్రంథము పరిసమాప్తము.

ఓం తత్‌. సత్‌ బ్రహ్మార్పణమస్తు.

-------------------------------------------------------------------------------------------------

ప్రథమ ముద్రణము 1979

ప్రోగ్రెసివ్‌ ప్రింటర్స్‌ - విజయవాడ-2.

ప్రతులు 500- హక్కులు మాని. వెల రూ. 3-00

Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters